Thursday, 19 November 2015

ద్విపదాలు : 2801 నుండి 2850 వరకు

..................................... ********.....................................
2801. నీ సంబరం తెలుస్తోంది ఎర్రగా..
ఆమె పెదవుల్లో పూచిన పువ్వులా..
2802. హృద్గుహ నిండా పొగలే..
దేహయాగం శాంతించేదాకా తప్పదేమో..
2803. సరికొత్త సేద్యం మొదలెట్టా..
భావాల పువ్వులు పూయించాలని..
2804. నిరాడంబరమైపోయా..
వెన్నెలదారిని కనుగొని నడుస్తున్నందుకేమో..
2805. అంతరంగాన్ని చింతాక్రాంతం చేసుకుంటావెందుకో..
వాగ్దాన విత్తనం మొలకెత్తనివ్వక..
2806. ముగియకున్నాయి అంతరాలు..
మకిలిపట్టిన అంతరంగాల్లో..
2807. నిశ్శబ్దాన్ని నాలోనే దాచుకున్నా..
విరహం మువ్వై మోగరాదని..
2808. రహస్యమైపోయిన కలనే నేను..
కలతను సమాధి చేయలేక..
2809. అనురాగాల కోయిలమ్మనే..
నీ తలపు వసంతమై నన్నావహించాక..
2810. తొలిపొద్దు వెన్నెల ముసుగేసుకున్నట్లు ఆకాశం..
నీ ప్రేమలో విలీనమైన నేనులా..
2811. తొలిముద్దు తేనయ్యింది..
చెలి ఊహించని గమ్మత్తైన మైమరపులా..
2812. నా కలాన్ని పెదవికి తాకించినందుకేమో..
ఊహించని పదును నాలుక సొంతమయ్యింది..
2813. నేనే ఆకాశమైపోయా..
మబ్బు పట్టిన కన్నులకు హరివిల్లువయ్యావని..
2814. కన్నీటిని సాగనంపేసా..
అడక్కుండానే చేతిరుమాలు బుగ్గలకు అరువిచ్చావని..
2815. ముసుగేసుకున్న ముఠాలెన్నో..
ధనం కోసమే ప్రాణాలనూ హరిస్తూ
2816. నేనే నువ్వైపోయా..
నా ప్రతిరూపాన్ని నువ్వు వలచావనే
2817. మనసు వయసును మరచిందిగా...
వెన్నెల్లో కాస్త కరిగిపోయిందని..
2818. ముసుగు తొలగిన వర్తమానాలను..
జ్ఞాపకాలను గొంతుకు ముడివేస్తూ
2819. అందం గుబాళిస్తోంది..
మేలిముసుగును దాటి మనసులు దోచేస్తూ
2820. మానవతా పరిమళం విరజిమ్ముతోంది..
ముసుగు వేయని దేహమనుకుంటా
2821. వెన్నెలైన దిగులుకే తెలుసు..
నిశ్శబ్దంలో మునిమాపుల నవరాగాలు..
2822. మనమెప్పుడో నువ్వయ్యా...
నీలో నే కరిగి ఒక్కటయినప్పుడే..
2823. మోసపోవడం అలవాటయ్యింది..
మార్చే ముసుగు రంగులకూ ముచ్చటపడినందుకు...
2824. మకిలి పడుతున్న అనుభవాల దర్పణం..
ముసుగేసిన అంతరంగాలు అర్ధమయ్యే కొద్దీ..
2825. కన్నుల్లో కొలువుండమన్నా..
కన్నీటికి చోటివ్వరాదనే..
2826. జీవితాన్ని ప్రతీకోణంలో చూడాలనుకున్నా..
చేదుకల్పనలే బాగుంటాయని మరచి..
2827. చొరవెక్కువే నీ చూపులకు..
చిత్తరువనుకొని అనిమేషంగా చూసేస్తూ..
2828. దాహం తీర్చలేదందుకే..
నన్ను నాకు కాకుండా చేసేస్తావని..
2829. నీ తలపుల పదునెక్కువే అనుకుంట..
నిన్న హృదయం కోమాలోకి వెళ్ళొచ్చింది..
2830. పాదరసంలా కరిగించేస్తావు..
వెన్నెల మంచుబిందువుల్ని రాల్చినట్లు నన్నేమార్చి..
2831. ఏనాడు కలలో కన్నావో..
గుర్తుపట్టలేనంతగా నన్ను చిత్రిస్తూ..
2832. మళ్ళీ శిశిరమే కానుకిచ్చావు..
నేనాశించేది వసంతాన్నని తెలిసినా
2833.
పలకరిస్తున్న కొన్ని జ్ఞాపకాలు..
మౌనాన్ని మానేసి మేలుకోమంటూ
2834. రాతిరికెంత సంబరమో..
మరందాలమోవిని గ్రోలేందుకు..
2835. తొలి వలపుకెన్ని తొందరలో..
అనుభూతులు ఎదకు పంచేందుకు..
2836. కమ్మనికలలు నీ వరమనుకున్నా..
రేయింబవలూ నువ్వే వస్తుంటే..
2837. నేనో మెరుపు..
నువ్వో ఆకాశమైతే..
2838. ఊహలమేనా ఊగుతోంది..
నీ తలపు మాధుర్యం ఎక్కువయ్యే..
2839. పున్నమిని పూసుకొచ్చావెందుకో..
పరవశాన్ని అంటగట్టేందుకు..
2840. చిగురించిన ఎండుమొక్కని తదేకంగా చూస్తున్నా..
మళ్ళీ వసంతమొచ్చిందంటే నమ్మకం కుదరలేదనే.
2841. కంటికి దూరమైన నిద్ర..
కనుకొలుకుల్లోనే జాలిగా సంచరిస్తూ..
2842. జీవన వైవిధ్యమదే మరి..
అర్ధంకాని చివరి మజిలీలో..
2843. కరుగుతోంది రేయి..
పంచుకున్న భావాలు వెన్నముద్దలై ఒదుగుతుంటే..
2844. ఎదురీదక తప్పదు జీవితంలో..
తీరాన్ని గెలిచి చూడాలంటే..
2845. మౌనవ్రతాలు చేయడం మానుకున్నాను..
నిన్ను గాయపరచి నొప్పించలేకనే
2846. ఆ చందమామ చిక్కినా అందమేననుకున్నా..
 నన్ను నెలవంకతో నువ్వు పోల్చినప్పుడల్లా..
2847. అల్లరవుతున్న నా వలపులు..
అమాయకమైన నీ మాటల్లో..
2848. జ్ఞాపకాలు వీడి పోవద్దనుకున్నా..
జీవితాన్ని హృదయంతో దర్శించలేననే..
2849. పెదవులనవసరంగా నవ్వాయి..
గులాబీలను వదిలి నీవు ముళ్ళను తాకుతావని తెలియక..
2850. కనుకొలుకుల్లో నిలిచిన నీరు..
ఎడారిలో దారితప్పిన యేరులా..
..................................... ********.....................................

No comments:

Post a Comment