Wednesday, 18 November 2015

ద్విపదాలు : 301 నుండి 350 వరకు

..................................... ********.....................................

301. సుతిమెత్తనే నీ పరిమళాలసడి..
నాకు వింజామరై వీచినంతసేపు..

302. పరవశమే..
పున్నాగనైన నన్ను ఆఘ్ర్రణించినందుకు..

303. మనిషికి ఇంకెంత పరిమళమో..
రాతికే అంత పరిమళముంటే..

304. మల్లెలతో తీరునేమోనని మనసు సలహాలట..
పరిమళ దాహమన్న ఆమె నీలాలకురులకి..

305. పెదాలకెన్ని గుసగుసలో..
నా నవ్వును నీలో తిలకించినందుకే

306. అంతమవని ఆర్తనాదమే..
పరస్పరభావాల నిరంతరఘర్షణలో

307. అనురాగం శృతితప్పింది..
నీ రాగాలు శూన్యమై మౌనవించినందుకే

308. మనసుకి మనోవ్యథే మిగిలేది..
తీరని మనస్తాపాల పంజరాలతో..

309. ప్రతీ చెంగల్వలో నువ్వే..
పూసింది నా బుగ్గల్లోననే..

310. చక్కనికవిత్వాన్ని కురిపిస్తున్నా..
మన్మథవిలాసాన్ని మాటల్లో అనుభవైకవేద్యం చేద్దామనే..

311. మనసు మీదపడ్డాకే తెలిసింది..
ఆనందానికి ఆమడదూరంలో ఉన్నానని

312. ఆలకిస్తున్నానందుకే..
వేణువుని మరిపిస్తోందిగా నీ ఊపిరి..

313. అరిమరికల్లేని ఆనందమే..
ఇరుమనసులు ఏకస్పందనై కలిసి కొట్టుకుంటే..

314. మాలికలను మాత్రమే గుచ్చడం మంచిదేమో..
అవినాశినైన అక్షరాన్ని ఆయుథం చేయకుండా..

315. మనసుతడి రుచి చూపించా..
ఎండమావిలో నీరు వెతుకుతున్నావనే..

316. నడకొస్తే సరిపోదుగా..
నడవడిక రావాలి నలుగురితో మెలిగేందుకు..

317. మార్గమెప్పుడూ సుగమమే..
సత్సంకల్పం తోడైతే ముళ్ళన్నీ పువ్వులవుతూ..

318. అక్షరమెప్పుడూ క్షరము కానిదే..
అంతకంతకీ విలువ పెంచుకుంటూ..

319. సమయం రావాలి..
కాయ పక్వానికి రావాలన్న..పరిహాసం దరహాసంగా మారాలన్నా

320. అక్షరాలకెక్కడ లేని పొందిక..
నన్ను వర్ణిస్తున్నప్పుడే సుమా..

321. విరహమే..
తలపుల నిర్బంధంలో బానిసనైపోతూ..

322. చిత్తమెప్పుడు మాటిన్నదని..
చపలమై చంచలిస్తూ..

323. నీ మనసెంత చల్లనో..
సుగంధాలనే తిని బ్రతికేస్తూ..

324. పిల్లవాగునేగా నేనింకా..
ఉడుకెత్తించి ఉరకలు పెట్టించకు నన్నేమార్చి..

325. ఆగని మనసే నాది..
నువ్వు చోటిస్తే హృదిలోకి..తరిమేస్తే వీధి లోకి..

326. మనసు నివేదనలన్నీ వృధాలే..
రసహీనమైన ఒంటరి ఆకాశాల్లో..

327. ఆకాశహర్మ్యాలను తాకేయలా..
హద్దన్నది ఉన్నదని గుర్తు చేసుకోక..

328. గుర్తుపడతాలే నిన్ను..
నువ్విచ్చిన ఉంగరం చేతికలాగే ఉందిగా

329. నవ్యానుభవమేగా..
ఏకాంతపు పరిమళాన్ని ఆస్వాదిస్తున్న ఈ క్షణం..

330. రసహీనమైతేనేమి..
నాలోని ఉషస్సుకి సాక్ష్యమదేగా

331. వేసవని మరచినట్లున్నావ్..
విహారానికి రానివ్వవా నీ ఎదలోకి..

332. ప్రతీవారూ నిండుజాబిలులేగా..
గ్రహణం తమకే పట్టిందని భావించేవేళలో..

333.  పుష్పవిలాపమే మరచావు..
నీ దేవేరి అడుగులకు మడుగులెత్తేందుకేనా..

334. తూరుపులోనూ ఉన్నది నేనేగా..
నీకు మేల్కొల్పులు పాడేందుకు..

335. చిత్రగ్రీవాన్నయిపోయా..
నా కంఠసీమను అలంకరించింది నీ మోవి కుంచెతోననే..

336. మనసంతా తీయతీయగా..
నువ్వు పంచిన ప్రేమామృతం గ్రోలినట్లుంది..

337. నిత్యసంతోషివేగా..
సంతోషం నీ పుట్టిల్లు అయినందుకు..

338. తప్పదేమో శిక్ష..
అభిమానించినందుకు అవమానమే బహుమానమై వస్తే..

339. గాలి వెనుదిరిగింది..
నీ ఊపిరిపరిమళాలకు తాను సరిపోనని..

340. పదిలమైన జ్ఞాపకాలనేమో..
నీ ఉత్తరం తిరిగి తోడింది..

341. చిగురించిందిగా వసంతం..
మన్మథుని మహేంద్రజాలం మహిమ మరి..

342. వారధి నిర్మాణమెప్పుడూ కుదరదెందుకో..
ఆశకీ ఆశయానికి నడుమ..

343. వేకువపూలనే తిరస్కరించింది మది..
నీ నవ్వులమోమును తిలకించేందుకని..

344. స్వేదబిందువే సింధు(భైరవి)వయ్యింది..
కాలుతున్న కడుపుకి దాహమన్నా తీరుద్దామనే..

345. మనసు మౌనవించింది..
నీ పదస్పర్శల ధూళితో ముచ్చట్లాడినందుకేమో..

346. నీకెప్పుడూ వసంతాన్నే..
వేసవిలో చైత్రవెన్నెలై నిన్ను తడిపేందుకు..

347. పంచామృతాలే నీ పలుకులు..
పంచభూతాలూ శాంతించి చిరునవ్వినట్లు..

348. ఆమని విరాగిణయ్యింది..
మధుమాస కోయిల విరహగీతాలు వల్లెవేస్తోందనేమో.

349. ఏకాత్మనే..
ప్రతీతీగలో..పల్లవాల్లోనూ నీవే ఐతే.

350. పంచమరాగమే పెదవులకు..
తీయని నీ పేరునుచ్ఛరిస్తే చాలు..

..................................... ********.....................................

No comments:

Post a Comment