Thursday, 19 November 2015

ద్విపదాలు : 2601 నుండి 2650 వరకు

..................................... ********.....................................

2601. అనుకోని వసంతమే నీవు..
ఎదురుచూడని కూహూల జడివానలా..
2602. జావళీలుగా మార్చేసుకున్నా జ్ఞాపకాలను..
విరహంలో వేసారక పాడుకోవాలనే..
2603. కనుగీటుతావనే చూస్తున్నా..
నీ చూపును అనుసరించి వచ్చేద్దామని..
2604. చూపుల చేవ్రాలును పోల్చుకున్నా..
నీ ఆనందాన్ని అంచనావేస్తూ..
2605. అలలా ఎగిసిపడుతున్న ప్రేమ..
ఆరుకాలాలూ నీతోనే జీవితమంటూ..
2606. గుండెచప్పుడు గుట్టువిప్పింది..
నీ తలపులకు మాత్రమే కొట్టుకుంటున్నానని..
2607. బోడిలింగంలా ఎదురవుతావెందుకో..
శివాలయానికి  బయలుదేరాలని నే ముస్తాబవుతుంటే..
2608. భావకుడివనుకున్నా..
నా పక్కన కలలో మరో కధానాయికుడ్ని కూర్చోపెడితే..
2609. అరుణరాగాల కువకువలు..
చెక్కిలిగుంటల మెత్తదనంలో చోటు దొరికిందని..
2610. గోరంతగుండె కావలనంటే ఇచ్చాను..
గోటికి రంగేసి నచ్చలేదంటూ పదిసార్లు తుడిచేస్తావని తెలియక..
2611. పరిష్కారం లేని పరిహారాలు..
అంతకుమించి వెలకట్టలేని నిరుపేదదేహాలు..
2612. హృదయానికెందుకో గలగలలు..
చిగురించిన ప్రేమ నువ్వింకా ఆమోదించనిదే..
2613. వసంతాన్ని శిశిరమని భ్రమిస్తావే..
హేమంతంలో నిలబడి చూసినందుకా..
2614. కూజితాలు చేయొద్దన్నానందుకే..
నలుగురూ నిట్టూర్చి నోళ్ళు నొక్కుకుంటారనే..
2615. ఇంద్రధనస్సును బాగా ఔపాసన పట్టినట్టున్నారు..
నచ్చిన రంగులు మెచ్చినట్లు పూసుకుంటూ..
2616. ఏమార్చడం చాతనైన మనసనుకుంటా..
ఏ మాత్రం మార్చలేవు..
2617. పట్టు దొరికింది పల్లకీలోనే..
పరవశాలకి తెరలు అడ్డుపెడుతూ..
2618. మాలికల మార్గంలోకి రధం తిప్పానందుకే..
సంజీవనై తిరిగి ప్రాణం పోస్తుందనే..
2619. నిరీక్షణల్లోనే కరిగిపోతున్న క్షణాలు..
లెక్కకందని అనంతమైన శూన్యాలు..
2620. ఇరుకవుతున్న భావాలు..
మధనపడుతున్న మానవసంబంధాలలో..
2621. నేనో సంతకం చేయని ప్రేమలేఖనేగా..
నువ్వు పోస్టు చేయని ఉత్తరాలలో..
2622. మౌనమే మేలు..
కంఠంలో కొలువైన దుఃఖాన్ని దిగమింగేందుకు..
2623.  మౌనమే మేలు..
మనసు పరిభాషను అందంగా అనువదిస్తుంటే
2624. మౌనమే మేలు..
శారదరాత్రుల తీయనికలలను నెమరేసే ఏకాంతవేళ
2625. విరగ్గొట్టినప్పుడే తెలిసింది..
పదునైన నీ మాటల  మెత్తదనం..
2626. శూన్యాకాశంలోనే విహరిస్తావెందుకో..
మౌనానికి నానార్ధాలు వెతకడం కుదరదనేమో..
2627. నీ చూపులకెంత చొరవో..
గుచ్చుకుంటూనే గిలిగింతలు పెట్టేస్తూ..
2628. కృష్ణపక్షాన్ని తలవొద్దన్నానా..
శారదరాత్రుల కోలాహలానికి సంతోషంగా వెళ్దామని..
2629. చెమట విలువ తెలిసినవాడేమో..
నుదిటిరాతను అలవోకగా కడిగేసుకుంటూ..
2630. అన్నీ మధురభావాలే..
నీ మనసును చేరేసరికి మౌనవించేస్తూ..
2631. రేయి గడిచిపోతుంది..
మధురసంతకాల లెక్కలు తేలకుండానే ఏమిటో..
2632. రాతిరీ ఒంటరిగానే..
నీ వియోగాన్ని పాటగట్టి పాడలేక
2633. ఉరకలెత్తే ఉల్లాసమే నీ తలపు..
నిరంతరానందాన్ని మనసుకు కానుక చేస్తూ..
2634. దారి తప్పిన కలలు కొన్ని..
రాతిరిని విడిచి వేకువను వాటేస్తూ..
2635. నీ ఆలోచనల ఆనంద సవ్వడి..
నా హృదయానికి మధురమైన అలలజడి..
2636. విరబూసిన మనోవనం..
వెదురుపొదల్లోని వంశీనాదం నీలో కనుగొంటుంటే..
2637. తరంగమవుతున్న మనసు..
తేలియాడిన భావమేదో నువ్వు మేల్కొల్పుతుంటే..
2638. నాగరాజులా బుసకొడతావే..
విడిచేసే కుబుసమై అల్లుకున్నానని మరచిపోతూ..
2639. గుక్కతిప్పుకోని గుండెచప్పుడు..
నువ్వలా ఎదచేర్చి ఊసులను ఆలకిస్తుంటే.
2640. ప్రణయరాగాన్ని మిళితం చేసా పిలుపులో..
శూన్యం నుంచీ జీవితంలోకి రప్పించాలనే..
2641. చితిమంటేసావెందుకో చెలిమికి..
ఆవేదనా గ్రీష్మంలో ఆసరా కాలేదనా..
2642. వ్యర్ధవాదనలు..
వినేకొద్దీ మనసును అధోగతి పాల్జేస్తూ..
2643. రాలిన ప్రతిచుక్కనూ వేడుకుంటున్నా..
నే మనసుపడ్డ ఆశయాన్ని మాత్రం ఎగిరేలా చూడమని..
2644. పారవశ్యంతో మూతబడుతున్న కన్నులు..
నీ చేతిలో వీణగా నన్ను నేను మలచుకుంటూ..
2645. అశాంతిని పంపేసా..
ప్రశాంతంగా నిన్నూహించాక..
2646. నిన్నటి కల గుర్తుకొస్తోంది..
నేడు నీతో ఊసులాడుతుంటే..
2647. కరుగుతున్న కాటుకలు..
నీ నిరీక్షణలో నల్లని కన్నీటిబొట్ట్లుగా...
2648. ప్రయత్నాన్ని మాత్రమే నమ్ముకున్నా..
గెలుపోటముల నిర్ణయం దైవానికొదిలి..
2649. మమతలు దారిమళ్ళాయి..
మౌనాన్ని వీడని మనసులకు చేరువకాలేక..
2650. మౌనపురద్దీలో చిక్కిన మనసు..
నీరవంలో నీడనుచూసి ఉలిక్కిపడుతూ..
..................................... ********.....................................

No comments:

Post a Comment