Thursday, 19 November 2015

ద్విపదాలు : 2401 నుండి 2450 వరకు

..................................... ********.....................................

2401. మనసుకు రంగేస్తున్నావెందుకో..
గుండె ప్రతిగదిలో నేనే ఉన్నానంటూనే..
2402. పువ్వులు పరచి ఉంచేసా..
నాకై నువ్వు నడిచేదారిలో ముళ్ళు అడ్డు రాకూడదని..
2403. ఊపిరి బరువైపోతోంది..
నీ భావంలో చోటు దొరకలేదనేమో..
2404. మనసును మాయచేసావు..
అంతరంగ దాహానికి నీళ్ళిమ్మంటే దీపమెట్టి..
2405. ఏడురంగులతో సరిపెట్టావెందుకో..
నా మనసురంగు మాత్రం విడిచిపెట్టేసి..
2406. నానార్ధాలతో మాట్లాడుతావెందుకో..
సమానార్ధాన్ని స్ఫురించనివ్వక నన్ను తడబెడుతూ...
2407. వెచ్చని నీ అనునయాలకేమో..
పచ్చని భావాలూ ఎర్రనైపోతూ..
2408. సరళీస్వరాలను సాగనంపానందుకే..
మన ప్రేమ సంకీర్తనావళిని మొదలెట్టేందుకే..
2409. చిత్తం చిందులేస్తోంది..
నా అలుకను నువ్వర్ధం చేసుకున్నావనే..
2410. నా చూపుకే కన్నుకుట్టిందెందుకో..
నీ చూపుతో కాల్చేస్తూ..
2411. పరభాషా సొంతమయ్యింది..
యాసతోతప్ప ఆనందానికి ఆటంకం లేదని..
2412. చిన్నారి నడకలతోనే మొదలెట్టమంటున్నా..
అలుపొచ్చేందుకు సమయమింకా రాలేదనే..
2413. కొన్నిరాగాలు రాత్రికి దాచేస్తున్నా.
ప్రేమవర్ణంలో మిళితం చేయాలనే..
2414. నీ భావాలకెన్ని భాష్యాలో..
చదివేకొద్దీ కొత్త అనుభూతినిస్తూ..
2415. అనువదిస్తున్నా అపశృతిని..
నువ్వు పాడేలా అరమరిక చేద్దామని..
2416. అలుకల పల్లకి దిగిపోయా..
బాధ్రపదమొచ్చి పండుగకు పిలిచిందనే..
2417. ఎంతందమో ఆమె అలుక..
మురిపానికి కొత్తర్ధాన్ని పరిచయిస్తూ..
2418. వెన్నెల్లో వరదలా నీవు..
నా ఏకాంతక్షణాలన్నింటినీ కాజేస్తూ..
2419. చూస్తూనే ఉండాలనుందెందుకో..
నువ్వెంత కాదని చూపులతో కసిరినా..
2420. కృష్ణావతారమే ప్రాణమట..
నలుగురిలో రామావతారం రక్తి కట్టిస్తున్నా..
2421. కిటుకులు తెలిసిన వన్నెలాడి..
నిన్ను గెలుచుకునేందుకేగా అలుకను అస్త్రం చేసింది కిలాడి..
2422. నురుగునై నీవెంటున్నానందుకే..
ఊహలసంద్రాన్ని చిలికేందుకు నీకు సహకరించాలనే..
2423. అలిగినందుకెంతో అలసిపోతున్నా..
మూణ్ణాళ్ళ నీ మురిపాలను భరించలేక...
2424. నీ ఊహల్లోకి చేరుకోవాలని ఉంది..
బాల్యం నుండే చెలిమి రుచిచూపేవాడివని..
2425. అమ్మభాషకు పట్టంకట్టేద్దాం..
మనలోనూ తెలుగు ప్రవహిస్తోందని చాటిచెప్దాం..
2426. తలుపు తీసి తలపుల్లోకి పిలిచావెందుకో..
చిగురుటాకులా ఒణుకుతావనే భయం నీకున్నప్పుడు..
2427. ఆఘమేఘమవుతోంది మది..
కలలోంచీ రెప్పల్లోకి జారి నీకు శుభోదయం చెప్పాలని..
2428. అలికినట్లవుతున్న  అక్షరాలు
కన్నులు ఆనందాన్ని వెచ్చగా ప్రకటిస్తున్నందుకే..
2429. మనసు మౌనగీతాలే మెచ్చుతోంది..
సన్నగా పులకరింపులేం నేర్చినందుకో..
2430. కట్నం పోసి నిన్ను కొనుక్కునందుకేమో..
నోములు నోచి మరీ కాపాడుకుంటూ..
2431. నా నవ్వులన్నీ నీకిచ్చేస్తా..
చూపుతోనే నన్ను మైమరపిస్తానంటే..
2432. అక్షరమవ్వని భావాలెన్నో..
గుండెలోనే గుట్టుగా అహరహమూ ఆస్వాదిస్తూ..
2433. నీ మౌనరాగం నేనేగా..
పెదవిప్పకున్నా కన్నులతో పాడేస్తూ..
2434. వధిస్తున్న నీ మౌనం..
నా గాంధారాన్ని వెక్కిరిస్తున్నట్లు..
2435. సమన్వయం కుదరని సమాధానాలు..
ప్రశ్నలు చిక్కుముళ్ళై బిగుసుకుపోతుంటే..
2436. ఉక్కిరిబిక్కిరవుతోంది మది..
నీ నిశ్వాసలోంచీ నన్ను తరిమేసాక..
2437. విరబూసా పరిమళమై..
పువ్వుతో పోల్చావనే..
2438. నిన్ను వశం చేసుకున్నాననుకుంది..
వివశమైందని గుర్తించని వెర్రిమనసు..
2439. చందనాలు పూసినట్లుంది..
నీ చూపులు చల్లగా మేనలదుకుంటే..
2440. ఏకాంత భావాలేమిటో..
నిన్ను సైతం చేరనివ్వని ఊహల్లో..
2441. ఊరేగుతూ మౌనాలు..
నీ సందిగ్ధాన్ని భగ్నం చేసాయని..
2442. ఒంటరి నక్షత్రమై మిగిలిపోయా...
వెలుగు పంచలేని ఆకాశంలో..
2443. కలలకు రంగులొచ్చాయి..
రాతిరి నువ్వొచ్చి సీతాకోకలా తిరుగాడినందుకే..
2444. పంకజనయనను అయ్యానందుకేగా..
కనుకొలుకుల్లో కన్నీటితో నిత్యం దర్శనమిస్తున్నందుకు..
2445. రేపటికి పువ్వునవుతాననుకున్నా..
మొగ్గగానే నన్ను చిదిమేస్తావని తెలియక..
2446. కదనకుతూహలానివనుకున్నా..
తోడిరాగాన్ని వేంటేసుకొచ్చావని తెలియక..
2447. అక్షరముత్యాలు దాచుకున్నా..
ఏనాటికైనా నా భావానికి పనికొస్తాయని..
2448. నిముషాలను లెక్కిస్తున్నా..
నిన్ను చేరే రాదారిని కొలవలేక..
2449.  మరణం ఒక విషాదం..
నిన్ను చేరలేని గమ్యంలో..
2450. కదలనంటోంది కాలం..
నిన్ను దూరం చేసి అలసినందుకేమో...
..................................... ********.....................................

No comments:

Post a Comment