Thursday, 19 November 2015

ద్విపదాలు : 2651 నుండి 2700 వరకు

..................................... ********.....................................
2651. వాస్తవాన్ని అతికినట్లుంది..
విరిగిన కలల్ని పోగేసి కలుపుతుంటే..
2652. చేవ్రాలు చేసేసా ఆనాడే..
నన్నచ్చెరువుగా నువ్వు మార్చేసినప్పుడే..
2653. ఎడారిలో ఒదిలేసావెందుకో..
రాళ్ళల్లో..ఇసుకల్లో మనపేర్లే ఉన్నాయంటూ...
2654. హంసనని గుర్తించావు..
ఇట్టే హింసపెట్టక జీవితాన్ని ఆస్వాదించు..
2655. భవిష్యత్తును రాసిపెట్టుకున్నా..
ఈనాడు దిద్దుకున్న అక్షరాలను అనుసరించాలనే..
2656. అల్లుకుపోయిన పేర్లలో నాదొకటి..
ఇసుకలో మసకగా కలిసిపోతూ..
2657. అలలా ఎగిసిన పేరంట..
కెరటాన్ని చేరగానే మాయమవుతూ..
2658. మౌనంగా దూరం జరిగానందుకే..
నా తనూగంధాన్ని కాజేస్తావనే..
2659. చెమరింతలపర్వం రాసేసా...
నీ బాహువల్లరిలో పులకింతలు పోగేసి..
2660. మానసవీణ మొదటిసారి మోగింది..
నీ కనుసైగకు స్పందించినందుకే
2661. అపురూప హృదయసవ్వడే నీది..

గతజన్మను తిరిగి మేల్కొల్పినట్లు..
2662. వెన్నెల్లో తిరుగుతావెందుకో..
చుక్కల మాటున దాగున్న నన్ను వెలికి తీసేందుకు..
2663. పైపై నవ్వులొద్దంటున్న మనసు..
చాచిన దోసిలింకా నిండలేదంటూ..
2664. సశేషమవుతున్న విశేషాలు..
నీ నిర్లిప్తతలో మనసు కుచించుకొని
2665. ఆరని మనసుతడి..
గోరువెచ్చని జ్ఞాపకాలు కొన్ని అనుసరిస్తుంటే
2666. నమ్మలేకున్నా...
కాటుకంత నిజాన్ని నిజాయితీగా నువ్వొప్పుకున్నా..
2667. మాట మౌనమవుతోంది..
మంత్రమై రాలే కన్నీటిబొట్టును ఆపలేదనే..
2668. అనామికగానే మిగిలిందామె..
తనను మనసునుండీ వేరుచేసి ఒంటరయ్యాక..
2669. శిశిరశరత్తును ఊహించినట్లున్నావ్..
హేమంతంలో వసంతాన్ని గురించి మాట్లాడుతూ..
2670. నేలకు జారింది నా మది..
ఆశకు రెక్కలు తొడిగినా నన్నందుకోలేవనే..
2671. నిద్దుర కరువవుతోంది..
కలలను కనలేని నా కనులను వెక్కిరిస్తూ ప్రతిరాత్రీ..
2672. మొలకెత్తిన ఆశలు కొన్ని..
నీ ఊసులను హత్తుకుంటూ..
2673. నీలికోకను కట్టుకున్నా నీకోసమే..
ఆకాశమని తలచి నన్నల్లుకుంటావనే..
2674. పడమటిసంధ్యారాగాలు..
ఎండావానలు కురవకుండానే ఆమె పెదవుల్లో విరిసిన వానవిల్లు..
2675. నిర్మలానందమవుతోంది మనసంతా..
నీ మౌనంలో ధ్యానంగా నన్నావహించావనే..
2676. పగలు రాక మానదుగా..
పొలిమేర దాటాడు సూరీడని..
2677. చిటికెల పందిరిలోనే కూర్చున్నా...
తలపులొస్తే తలుపు తీసుంచాలనే..
2678. శిధిలమవుతున్న జ్ఞాపకాలు కొన్ని..
తడుముకొనే తీరికలేక వలసపోతూ..
2679. గతాన్ని గోతిలో పూడ్చేయాలి...
ఒక్కసారి రాలిన పచ్చదనం తిరిగి చిగురించడం అనివార్యమని...
2680. నిప్పుని ముట్టుకోవడం మానేసానందుకే..
అరచేతిని కాల్చి మండిస్తుందని..
2681. ఏడడుగులేసి ఆరునెలలయ్యిందిగా పాపం..
ఒకరిదారి మరొకరయ్యారేమో తెలివిగా..
2682. సింధూరమందుకే దిద్దుతున్నావేమో..
నొసలు దాటి మనసును చూడొద్దని..
2683. అక్షరాలు అలుక్కుపోతున్న భావన..
రాయాలనుకున్నది కలానికి అందక..
2684. అల్లిబిల్లి పదాల అల్లరులు..
తమనే ముందు రాయమంటూ ఉరకలెత్తే ఉత్సుకతల అలుకల్లో...
2685. మనసిప్పుడే వయసుకొచ్చినట్లుంది..
సమన్వయం కుదరని యుద్దానికి తెరతీస్తూ..
2686. చెలిమిని దిద్దుకున్నా అక్షరంతో..
లేపనం అక్కర్లేకనే గాయాన్ని మాయం చేసే నేర్పుందని..
2687. ముభావమే భావమయ్యింది..
ముత్యాల పల్లవికి చరణంగా చేకూరావని..
2688. నిశ్శబ్దంగా పోటెత్తింది మౌనం నాలో..
నీ రుధిరాన్ని చూసి నేర్చుకున్నట్లుంది..
2689. పెనుచీకటొకటి చెదిరింది..
వెన్నెలవై చేయందించావనే..
2690. అర్ధంకాని మనస్తత్వాలు ఎన్నో..
అసంపూర్ణభావాలతో అమాయకత్వాన్ని నటిస్తూ..
2691. పరిక్ష పెడుతున్న సమయం...
నిన్ను చేరేలోపు కదిలిపోతూ...
2692. నీ మాటే మంత్రమై పనిజేస్తోంది..
ఏ మంగళవాద్యాన్ని మిళితం చేసినందుకో...
2693. నేనే నువ్వయినట్లుంది..
నీ మాటలు మాత్రమే ఆలకిస్తూంటే నా మనసు..
2694. రహస్యమవుతున్న జీవనం..
వాగ్దానానికీ వాస్తవానికీ మధ్య ఇమడలేక
2695. చల్లదనం సరిపోయింది..
మట్టికుండవైనా తీయదనాన్ని ఆసాంతం పరిరక్షిస్తూ..
2696. మది ముక్తినొందింది..
వెతలకు వీడ్కోలిచ్చాక..
2697. సంధ్యారాగం శాశ్వతం అవుతానంది..
రాతిరిరంగును కెంజాయకి అద్దలేనంటూ..
2698. పచ్చదనం పూస్తున్నా క్షణాలకి..
మళ్ళీ మొలకెత్తే ఆలోచనలందిస్తూ..
2699.  అమరస్వరాలవుతున్న సరిగమలు..
నీ పెదవులమీంచీ నాలోనికి ప్రవహిస్తూ
2700. అధరాల మెరుపులు..
నీ వలపు పిలుపులకు వంతపాడుతూ..

..................................... ********.....................................

No comments:

Post a Comment