Thursday, 19 November 2015

ద్విపదాలు : 2351 నుండి 2400 వరకు

..................................... ********.....................................
2351. నింగికెగిసింది..
ఓటమిని అంగీకరించలేని ఆత్మొకటి..
2352. పట్టుచిక్కిన ఆనందానివే..
కోయిలపల్లవులను నా నోట పలికించేవేళ..
2353. నయ్యం..సీతాకోకనూ నేననలేదు..
వేరే కోకవసరం లేదంటూ..
2354. కుదుటపడిందిలే మనసు..
మనసెరిగి మసలుకొనే నువ్వు నాదైనందుకు..
2355. చిదిమేసిన కలలు కొన్ని..
నీ అభిమానంతో చిగురులేస్తూ..
2356. జీవితమంతా పాఠమే..
చదివే మనసు ఆకళింపు చేసుకోగలిగితే..
2357. మబ్బులడ్డొస్తున్నాయెందుకో..
నాకు సమాధానమివ్వలేని చుక్కల్ని దాచేస్తూ..
2358. ఒడిసిపట్టా నీ జ్ఞాపకాన్ని..
మధురంగా మనసులో మిగుల్చుకోవాలని..
2359. గమ్యమెప్పుడూ గెలుపేగా..
అడుగులు తడబడక ముందుకే సాగుతుంటే..
2360. బోధివృక్షాన్ని గుర్తుపట్టనట్లున్నావ్..
ద్రాక్షపందిరి కింద కూర్చుంటే అంతేమరి..
2361. బొత్తిగా మాట వినని మనసు..
పేర్లన్నీ తారుమారు చేసి పలికేస్తూ..
2362. సర్దుకున్నాలే..
తిరగేసిన పేరుతో పిలిచినా నన్నేనని..
2363. వసంతం చిగురేసేదెన్నడులే..
శిశిరాన్ని తలచుకొని రాత్రులన్నీ పొద్దుపుచ్చుతుంటే..
2364. ముత్యపుచిప్పలే మిగిలేది..
ముత్యాలు విదేశాలకి పయనమై ఎగిరిపోతుంటే..
2365. ఏకాంతపు నవ్యానుభూతులన్నీ నాలోనే..
నీ తలపులనంతమై నన్నావహిస్తుంటే..
2366. అలసిన మానసిక స్పందనలు కొన్ని..
నిన్ను మేల్కొల్పాలని తాము నిద్దురపోతూ..
2367. చిగురిస్తుందిలే ఒంటరితనం..
తుంటరినై నేనొచ్చి నీలో చేరాక..
2368. విషాదాన్ని మింగేసిన శిశిరాన్నే..
వసంతాన్ని మాత్రమే వెదజల్లుతూ..
2369. మనుషులెందుకు నేర్చుతారో వికారాలు..
మనసుకు తెలియని అరమరికలు..
2370. నీ కలలో కరిగే కాలం..
నా రాతిరికి నీవే పరవశం.
2371. విత్తులెక్కువే మనసుకొమ్మకి..
కోటి కోర్కెలనూ నిముషంలో మొలకలెత్తిస్తూ..
2372. చక్కదనం చిక్కిపోయింది..
విరహవేదనకి వశమైనందుకేమో..
2373. అసమాన్యమే నీ కవిత..
ఆలోచననే అల్లికగా మెప్పిస్తూ..
2374. అంతులేని గమ్యమేమో నాది..
నిన్నెతకలేక అలసిన క్షణాలసాక్షి
2375. పుట్టెదు దుఖఃమవుతోంది..
పట్టలేని సంతోషం గుప్పెట్లో ఇమడలేనందుకేమో...
2374. తానో చైతన్యం..
శిలనైన నాలో..
2375. భూభ్రమణమని చలించలేదు..
నా నడకలకి విస్తుబోయానని తలపోస్తూ..
2376. అరవిరిసిన పువ్వైనందుకేమో మోము..
ఇంద్రుడివై తాగేస్తున్నావు మధువునంతా..
2377. వెలిసిపోయింది ప్రేమ..
నీ నోట్లో నానినాని నన్నందుకోలేక...
2378. నిశ్శబ్ద యుద్ధమెందుకో..
అలరించే అనురాగం వలయమై నిన్నల్లగా..
2379. అలదుకోలేని గంధానివే..
ఎంత పూసుకున్నా సుగంధాన్ని పంచక..
2380. పూర్వజన్మ వాసనలు పోనందుకేమో..
ఎప్పుడూ చిరుగులనే ఆరాతీస్తున్నావు..
2381. గిలిగింతల కిలికించితానివే..
కవ్వింతలతో నా మనసు గెలిచేస్తూ..
2382. అందెలతో సవ్వడి చేస్తున్నా..
నీరవంలో నిట్టూర్పులు వినబడినందుకే..
2383. దయలేని ఆనందానివే..
నన్నుడికించి ఇందరిలో అల్లరి పెట్టేస్తూ..
2384. మనసు గాలి పీల్చుకుంది..
పూలతెమ్మెర నీలా వీచిందనే..
2385. నా మనసుకెందుకో అలుకలు నేర్పావు..
నీకు ముచ్చటగా కులుకులు నేర్పితే..
2386. నా నువ్వూ నీ నేనూ..
ఏకమైన మన జీవనరాగంలో శృతిలయలుగా..
2387. దయార్ద్రమైనదే కాలం..
ఒడిదుడుకులను ఓర్చుకొని నిరాడంబరంగా కదిలిపోతూ..
2388. నా అణువణువూ ప్రవహిస్తున్న ఆనందం..
నువ్వు ప్రవచించిన విషాదాన్ని వీడినందుకే..
2389. కొట్టుకుపోతూనే ఉన్న కొన్ని అనుభూతులు..
ఆ హృదయంలో స్థానం దొరకలేదంటూ..
2390. విరిసిన పువ్వుల లాస్యాలే..
అరవొంపుల పెదవుల్లో నెలవంకలుగా..
2391. కులుకును నియంత్రించేసా..
నియంతలా నా అధరాల్ని శాసించావనే..
2392. ఉత్సాహం ఉట్టికెక్కింది..
సల్లాపాన్ని నువ్వెళ్ళి అనంతంలో వెతుక్కుంటుంటే..
2393. కలవంక నయగారాలే..
నీ తలపును ఆవహించే నవ్వులు..
2394. నలుగురిలో నన్ను ఏకాకిని చేసావెందుకో..
ప్రసరిస్తున్న చూపును దాటి ఏకాంతాన్నెతుక్కుంటూ..
2395. అపరాజితను చేసేసావు..
నవ్వులను నీ మధురోహలుగా మార్చుకొని..
2396. వెన్నెల పుప్పొడేదో రాలినట్లుంది..
శ్వాసలో గంధం పొడారినందుకేమో..
2397. అస్తవ్యస్తమైన మానసం..
నీ అన్వేషణ నన్ను చేరనందుకేమో..
2398. పరిహసించానని బంధించావుగా..
అమూల్య రత్నమైన నన్నెవరికీ ఇవ్వనంటూ...
2399. చిత్తరువునై నిలబడిపోయా..
నా చిరునవ్వుకి చిరునామా వెతికే నిన్నేమనాలో తెలియక..
2400. మెరిసి మురిపించాలని ప్రయత్నిస్తున్నా..
బంగారమని పిలుస్తూ నన్నాకట్టుకున్నావుగా..
..................................... ********.....................................

No comments:

Post a Comment