Wednesday, 18 November 2015

ద్విపదాలు : 1001 నుండి 1050 వరకు

..................................... ********.....................................
1001. చల్లనిగాలులే వింజామరలు..
ప్రకృతికన్నెకు నిత్య సుగంధాల సేవలు..
1002. ప్రశ్నలతోనే ముడిపడ్డాయి..
సమాధానం లేని కొన్ని జీవితాలు..
1003. కెంజాయి రంగంటే ప్రీతి కాబోలు..
సంజెకి రంగు మార్చింది నీలాకాశం..
1004. మౌనంలో ఒదిగిందేమో మనసు..
అమాసనీడల్లో నిలబడే ఓపికలేక..
1005. . నీ అధరగంధం పులుమినందుకేమో..
పువ్వులను సైతం వీడి నన్ను వెంటాడుతున్న తుమ్మెదలు
1006. వెలుతురైన నన్ను తరిమేసావు..
కోరుకున్న చీకటిరాజ్యానికి రాజువయ్యావు..
1007. ఆటాడించేవాడొకడుంటాడు...
జీవిత నాటకాన్ని రక్తికట్టించమని సూచిస్తూ..
1008. సరస్వతిని ఉడికించాలనుకున్నాడు బ్రహ్మ..
అందుకే నన్ను సృష్టించాడు..
1009. ప్రకృతి సైతం ఘోషిస్తోంది..
వికృతమయిపోయిన విషహృదయాలను చూసినందుకే..
1010. యేరు దాటాక తెప్ప తగలేస్తారెందుకో..
అవసరం తీరాక కృతజ్ఞత అనవసరమనేమో
1011. సర్వమానవ సమానత్వమెక్కడిదిలే..
అగాధ కుహరంలో తలదాచుకొనే మనసులో..
1012. మరిన్ని నవ్వులు కావాలని ఉంది..
నీ మాలికలతో మనసు వికసించగా..
1013. వేదనంత ప్రియమయ్యిందెందుకో..
మనసును పణంగా పెట్టి వరించేంత..
1014. సంతోషమవుతోంది..
అందానికే అందాన్ని గుర్తించినందుకు..
1015. నీదో సున్నితమైన మనసని కనిపెట్టేసాడేమో..
పదునైన ఆయుధం అనవసరమని భావిస్తూ..
1016. ఏకాంతంలో మౌనం..
నీరవంలో ఏ రాగాలు రుచించట్లేదని..
1017. అప్సరసనే
నీ మాటలకు స్వేదం పట్టకముందు..
1018. గోరంతగుండె నాదని మొన్నే తెలిసింది..
తనువంతా ప్రేమ ఇంతింతై ఆక్రమించినప్పుడే..
1019. నిన్నటిఊపిరే పీలుస్తుంటారు కొందరు..
రేపటి విప్లవానికి ఎదురుపోలేక
1020. చిక్కుకున్నా నీ తలపుల్లో..
మనసు మడుగు రంగులీనేలా...
1021. నిన్నటిదాకా నిన్ను పూసుకున్న చెక్కిళ్ళే..
నీ వియోగంతో రాల్చుతున్న కన్నీళ్ళు..
1022. కొన్ని అబద్దాలూ అక్షరాలై రాలాయి..
ఘనమైన చరిత్రను సమాధి చేయాలనేమో..
1023. రేపు కూడా నేనే..
వేదనకు వేకువను పరిచయిస్తే..
1024. స్వచ్ఛమైన పువ్వులకు విలువేముందిలే..
కాగితపుపువ్వుల మెరుగులకే ముచ్చటెక్కువవుతుంటే..
1025. కూపస్థమండూకాలే అవి..
తమకు తెలియని లోకం మరొకరికి తెలిస్తే ఓర్వలేక..
1026. నిన్నటి నేనో జ్ఞాపకాన్నేగా..
రేపటి ప్రేమల వెతుకులాటలో..
1027. నిన్ను ప్రేమించాకే తెలిసింది..
నేనో అవకాశవాదిని చేరదీసానని..
1028. రాగాల్ని పాడటం మానేసా..
నీ అనురాగాన్ని ఆలకించినందుకే..
1029. నక్షత్రమై విరహించినందుకేమో
గగనమెక్కి జాబిల్లిని చుట్టుముట్టింది మనసు..
1030. అసంపూర్ణమైన భావమొకటి..
నిన్ను చేరలేని వేదనలో నలిగిపోతూ..
1031. మనసంతా నిండాలనుంది..
మరొకరిని ఆహ్వానించి నన్ను మరువకుండా..
1032. ఎన్ని ఆకర్షణలో..
మౌనంలోకి తొంగిచూడాలనుకొనే నీ కన్నుల్లో..
1033. కొన్ననుభవాలు ప్రహేళికలే..
అర్ధానికందని జీవితంలో..
1034. కన్నులకు మంత్రం వేయాలి..
కలలను నిద్దుర లేపాలంటే..
1035. ఊసులన్నీ గోలచేసాయ్..
నీ మిఠాయి మాటలింకా కావాలని..
1036. అదే మౌనం..
ఏకాంతంలో నవ్యానుభవంలా...ఒంటరితనంలో కృష్ణబిలంలా..
1037. భావాలకు కొదవేముంటుందిలే..
నా సౌందర్యాన్ని నీవారాధించడం మొదలెట్టాక..
1038. భావాలకు కొదవేముందిలే..
నీవు మిగిల్చిన భగ్నహృదయం తోడయ్యాక..
1039. మనసు చెమరించింది..
నువ్వు కన్నీటి విలువను కనుగొన్నందుకు
1040. మకరందం ఒలికినట్లుంది..
మాటల తీయదనం చెవికి సోకుతూంటే
1041. అక్షరాలు హొయలొలికితే భావాలు..
అనుభూతిగా మారెను మాటలముత్యాలు..
1042. నీ చెలిమెంత గొప్పదో..
అడక్కుండానే చేయిచ్చి ఆదుకున్నందుకు
1043. అనుభూతుల దొంతరలెన్నో..
జీవించేందుకు చైతన్యమిచ్చే కొన్ని జ్ఞాపకాల్లో
1044. కొన్ని ఆనందాలంతే..
స్మృతుల పడవలై మనసుతీరాన్ని తాకేవి..
1045. ఆ క్షణాలకి మరణం లేదు..
నీ నిరీక్షణల ప్రతీక్షణలోనే కదులుతూన్నా..
1046. సముద్రమూ మౌనవించింది..
అన్వేషణకందని నీ అంతరంగాన్ని శోధించలేక
1047. ముగియని అన్వేషణేచ్ఛ,.
భానోదయమైనా వెలుతురు ప్రసరించలేదేమనా హృదయంలో..!
1048. అడుగుజాడల్లోనే నిలబడిపోయా..
అన్వేషించే జ్ఞాపకాల్లో నీవు ఎదురవక..
1049. అన్వేషణ ముగిసింది..
మరో ఉల్లాసమైన ఉదయం మొదలైనప్పుడే..
1050. అన్వేషణ మృగ్యమే..
సఫలం కాని స్వప్నాల వేటలో..
..................................... ********.....................................

No comments:

Post a Comment