Wednesday, 18 November 2015

ద్విపదాలు : 1201 నుండి 1250 వరకు

..................................... ********.....................................

1201. అమాసైనా వెన్నెల కురవాల్సిందే..
చెలి చెక్కిలిగుంటలు అరనవ్వితే..
1202. పిల్లగాలితో పనేముంది..
మెచ్చిన చిరుచెమటతో తాపం తీరుతుంటే..
1203. కస్తూరి గంధాలు పులుముకున్నట్లుంది..
నీ తలపును ఆఘ్రాణిస్తుంటే..
1204. ఎన్ని ఆషాఢాలు అధికమై వస్తేనేమి..
నీ తలపును దూరం చేయలేనప్పుడు..
1205. శిశిరంతో సమానమేమో..
ఆ జీవితం ఆషాఢాన్నే తలపిస్తుంటే..
1206. నేను నువ్వు వేరని ఎవరన్నారు..
మనసుని నమ్మక నిజాన్ని నిలదీస్తావే..
1207. నీ స్మృతులెప్పుడూ అమృతమే..
నమ్మకాన్ని నిర్భయంగా సేవించినందుకు..
1208. ఆషాడం మనసుకు మంటా.,.
ఆలూమగలకు తెచ్చెను తంటా..
1209. మెరిసింది వానవిల్లు..
ఆషాడపు తొలకరిజల్లు నువ్వలా తీయని మాటల్లో కురిపిస్తుంటే..
1210. ముసురేస్తే మేఘసందేశమనుకున్నా..
ఆషాడం నీ విరహాన్ని అతిశయిస్తోందనుకోలా..
1211. నిత్యం వెంటపడతావెందుకు..
నీరవంలో దెయ్యమని నే భ్రమపడేందుకు..
1212. పిలుస్తుంటే ప్రేమతోననుకున్నా..
ఆరాలు తీసి ఆజ్యం పోస్తావనుకోలా..
1213. మీరు మరీను..
హాస్యం అతిశయించి చతుర్లలో పడ్డట్టు..
1214. పులకరిస్తే పూలవనమనుకున్నా..
వణికిపోయే వానపామువనుకోలా..
1215. మూగబోయాయెందుకో పెదవులు..
మౌనవించిన మనసును నీకు చూపెట్టేలా..
1216. అనుపల్లవినైపోయా..
నీలో స్వరాలు అనురాగాన్ని మించుతుంటే,.
1217. లాస్యమే లయం చేసా..
నీలో ప్రియమై వెలగాలని..
1218. కురిసింది మధురభావన..
అమృతాల విందంటూ నన్ను ఆహ్వానించినప్పుడే..
1219. ఏమిటో నీ గుసగుసలు..
మాలికలకీ చెవులుంటాయని మరచినందుకేనా..
1220. పచ్చబొట్టంటే ప్రీతెందుకులే..
ఆషాడమని నా అరచేత గోరింట పెడితే చాలదా..
1221. గుండె గేయాలు రాస్తుంది..
ఆకాశమెక్కించి నువ్వు అలరించాక..
1222. రెపరెపలాడింది మనసు గువ్వై..
చిరుగాలివై నన్ను తాకినందుకే..
1223. అరనవ్వులతో సరిపెట్టుకున్నా..
అధరాల అరుణిమను నువ్వు గమనించలేదనుకునే..
1224. వానకోయిలలు వినబడ్డాయి..
నువ్వు ఆదేశించావనే వీల వేస్తున్నామంటూ..
1225. నా మనసుకెన్ని నాట్యాలో..
నీ పాటకు పరవశించినందుకే..
1226. నేను సైతం కలస్వనమై ఆలపించా..
నీ కావ్యంలో నన్ను రాసినందుకే..
1227. నెమలిపింఛాన్ని కట్టుకున్నా..
నీ మనసును గెలిచి ఆకట్టుకోవాలనే.
1228. నేను నేనుగా బయటపడలేకున్నా..
నీ మనసులో బంధింపబడ్డాననే..
1229. నువ్వోడినా నన్ను గెలిపిస్తున్నావుగా..
ప్రేమపోరాటం ఇద్దరిదీ అంటూనే..
1230. అనునాదమై నిలవాలనుకున్నా..
నీ నాదానికి సంపూర్ణ సహకారమై..
1231. ఆనందంలోనూ విస్మయమవుతూ
ఎన్ని మలుపులో మన ప్రేమలో..
1232. మనసు గర్విస్తోంది..
నన్ను నన్నుగా నీవు పొదుపుకున్నందుకు..
1233. అలరించావుగా హృది..
అందించి మణిమయ మాలికల హారాన్ని..
1234. గాయలకెప్పుడూ దూరమే..
గేయాలను మాత్రమే అందించే తాపత్రయంలో..
1235. కొత్తపూల మధుమాసమే నేను..
అరనవ్వుల ఆహ్వానంతో నువ్వెదురైనందుకు..
1236. అక్షరం వెలుగుతూనే ఉంటుంది..
భావాన్ని స్పష్టంగా చూపిస్తూ..
1237. గోరింటసిరులన్నీ నావే..
పండిన అరచేయి నువ్వందుకొని నడిపిస్తున్నందుకు..
1238. నా అనుభూతి చెరిగిపోనంది..
భావంలో అందంగా కూర్చేవరకూ..
1239. మనసు నిండింది..
నా అరచేతి గోరింట నీ కన్నుల్లో పండిందనే..
1240. కాలాన్ని ఓర్చుకుంటున్నా..
ఒకనాటికి తప్పక ప్రశ్నకు బదులిస్తుందనే..
1241. ఎన్ని విషాలు చిమ్మితేనేమి..
కల్పవృక్షమై నువ్వు పక్కనుండగా..
1242. మనసు మధించినందుకేమో..
మొదట విషం వెలువడినా అమృతం కురవక తప్పలేదు..
1243. నీడను తోడడిగినందుకేమో..
గతమే నీడై నీవెంట అనుసరిస్తూ..
1244. పునరావృతమేగా  జీవితం..
ఒకే వృత్తంలో వలయమై తిరుగుతుంటే..
1245. గోరింటకెంత గర్వమో..
అలుకల ఎరుపుకి తానూ తోడయ్యానని..
1246. గాలిపటం పిలిచింది..
ఆశల రెక్కలు విప్పుకు ఎగిరానందుకే..
1247. తలుపులు తీసుంచానందుకే..
ఏ తడవకైనా మనసు తడతావనే..
1248. ఋతువు రాగాలు మరిచింది..
ప్రకృతి గతి తప్పిందనే..
1249. మనోదర్పణం వెలిగింది..
నిన్ను చూసిన అపురూప కాంతులతో..
1250. సంపెంగని చిదిమేయమంటావే..
నీకు జలుబు చేస్తే నేరమేంటని..
..................................... ********.....................................

No comments:

Post a Comment