Wednesday, 18 November 2015

ద్విపదాలు : 201 నుండి 250 వరకు

..................................... ********.....................................

201. మనసు చెరువయ్యింది..
నీ కన్నీటిని పోగుచేసి దాచినందుకే..

202. మనవి ఆలకించడం మానేసింది..
మనసులో నువ్వు లేవన్న నిజం తట్టుకోలేని చెవి..

203. మాటలూ మంత్రాలయ్యాయి..
చూపులు బాసికములై మోవితీపులు తేనెలయ్యేవేళ..

204. తన చూపులలో అలవోకగానే చిక్కుకున్నా..
నగుమోము గలవాడు నా మనోహరుడేనని..

205. గాలికీ పరిమళగంధమంటింది..
ముత్యాలతలంబ్రాల పుప్పొడి మీంచీ వీచిందనే..

206. శశిముఖే సీతమ్మది..
పదాలుకళలూ అద్దుకొని.

207. మనోరధం వేగమయ్యింది..
విల్లు విరిచిన బాహుబలం చూచినంతనే..మనసు గెలిచాడని..

208. నీ పదఝరుల విన్యాసానికే..
నా మనసు పురివిప్పింది..

209. అనుగ్రహవీచికలేమో అవి..
హృదయతేజస్సు రెట్టింపవుతోందిగా..

210. గమ్యంలేని పయనమేగా అలుపులేని కాలానికి
వెనుదిరుగక సాగిపోతూనే ఉంటుంది హుషారుగా..

211. పశ్చాత్తాపానికీ పరవశముందేమో..
సంతోష విషాదాలకి తేడా తెలియనప్పుడు..

212. కొట్టుకుపోయింది ప్రేమంతా..
ఆనకట్టేసి నువ్వాపలేదనే..

213. సూర్యిడికే సింధూరం అరువిస్తావు..
నా నుదుటిన దొంగిలించుకెళ్ళి..

214. భూతద్దంలో చూసేదందుకే..
కాకి కోకిలగా మారిందేమోనన్న అనుమానంతో..

215. పుష్యమిపువ్వులూ వేడెక్కాయి..
నీ చూపులసెగలను భరించలేకే కాబోలు..పుష్యమిపువ్వులు కరిగిపోయాయి..

216. పుష్యమిపువ్వులు కరిగిపోయాయి..
నువ్వు స్వీకరించని పూజ నిష్ఫలమనేమో..

217. పూజెంతో పవిత్రంగానే చేసాను..
వరమీయడమిక నీ చేతిలోనేగా..

218. అరవిందుడికెంత ముచ్చటో..
నిన్నజేయుడిగా నిలబెట్టెందుకు తాను సహకరించడంలో..

219. అరవిరిసిన కుసుమమే చిన్నబోయింది..
విరిసిన నీ అందమైన నవ్వుకు తాను తూగననుకొని..

220. నేనెప్పుడూ నిత్యవసంతాన్నే..
శిశిరంలో ఉన్నా నిన్నెప్పుడూ మరువలేదుగా..

221. హరివిల్లునే..
నీ ఆనందాలు నాకోసం చెమ్మగిల్లినప్పుడల్లా ..

222. మెరుస్తోంది భావమే..
ముభావమైన తనను అనుభూతై అల్లుకున్నావనే..

223. నీ మనసు బానే కరిగిపోయింది..
నా మనసుని మాత్రం ఘనీభవించేసి..

224. కనులు దించుకున్నా మౌనమై...
సిగ్గుతెరని కన్నీటిపొరగా పొరబడతావనుకోలా..

225. ఈ లోకంతో పనిలేదు నాకు..
నీ ఊసుల సామీప్యం  ఉన్నంతవరకూ

226. పొలిమేర దాటుతోంది మనసు..
నీ కావ్యసరస్సులో ఈదులాడాలనే..

227. మనసు ఘోషిస్తోంది..
తెలిసిన దయ్యమే తెలియని దేవుని కన్నా మేలని..

228. అక్షరసందేశమే అనువైన యోచన..
మానవాళికి మేలుకొల్పు కావాలంటే..

229. తేనెవానల్లు కురిపించానందుకే..
మెల్లిగా తన్మయత్వపు లోకంలోకి జారతావనే..

230. చెమరించని కళ్ళెన్నో..
కారుచీకటిలో మగ్గిపోయే హృది సాక్షిగా..

231. వేదనని హత్తుకోవడం తప్పలేదు అంతరంగానికి ..
ఆత్మీయతరంగాలు నాపై వీచకుండా పోతుంటే..

232. శిశిరానికీ పూలు పూస్తాయేమో..
నీ ఊపిరి వసంతానికి..

233. స్వేచ్ఛుండీ ఏమి లాభం..
మనసనే ఊబిలోకే మళ్ళీమళ్ళీ దిగి గతాన్ని తోడుతుంటే..

234. నువ్వేళ్ళావని తెలిసింది..
ఝుమ్మనే తుమ్మెద రొద ఆగిందని..

235. పూలగాలి రెక్కలపైనే నేనొచ్చా..
నగుమోముని జాబిలని భ్రమపడ్డావేమో..

236. మానవత్వం అడుగంటింది..
మనుషులమధ్య వైషమ్యాల సెగ ఎక్కువవుతుంటే..

237. పున్నమితొలకరులే అవి..
పసిడినవ్వుల వెన్నెలకాంతుల మాలికా తరళములు..

238. కలాన్ని వెంట తెచ్చుకున్నా..
నువ్వు కనపడగానే నీ మనసైన సంతకం అడుగుదామని..

239. ముంగురులు ముస్తాబవుతున్నాయి..
దశమినాటి వెన్నెల్లో నీతో చదివించుకుందామని..

240. మనసుపుటలన్నీ నిండిపోయాయి..
నీ కొనగోట రసగీతి లిఖించినంతనే..

241. రహదారైతే ఏముందిలే..
నిరంతరం దారి తప్పిపోతానని నువ్వంటుంటే...

242. కాలం వెనుదిరిగింది..
కడగండ్లనూ నువ్వు వడగళ్ళుగా మార్చుకున్నందుకే..

243. నీ పదములు నర్తించినట్లున్నాయ్..
నా మనసు తాళమేస్తుంటేనూ.

244. చెక్కిళ్ళు కొలనులవుతామన్నాయి..
ఎర్రకలువల సాగు మొదలెట్టాలని ఉందంట..

245. ఆనందం హరివిల్లయ్యింది..
చక్కదనాల రంగులన్నీ ఆకాశమదిలో చెదిరినందుకే..

246. ఆత్మపరిశీలనే బ్రహ్మాస్త్రం..
మనలోని వివేకాన్ని మనమే గుర్తించేలా..

247. సందేహాల ఊయలవుతోంది మది..
కొత్త అనుమానాలు రేపొద్దనేమో..

248. గోరింటకెన్ని రంగులో..
పచ్చ తీసుకొచ్చి సింధూరమంటించి పోయింది..

249. మార్గం వేరైతేనేమిలే..
మన ఇరువురి గమ్యం ఒకటైనప్పుడు..

250. విరిసిన కుసుమానివే..
నా ఆంతరంగిక ఏకాంతపు తోటలో
..................................... ********.....................................

No comments:

Post a Comment