Thursday, 19 November 2015

ద్విపదాలు : 2851 నుండి 2900 వరకు

..................................... ********.....................................

2851. విషాదాన్ని నటిస్తున్న హృదయం..
నవ్వితే నువ్వు దూరమైపోతావనే..
2852. ఎండిపోయిన నిజం..
కన్నుల్లో నీరింకి బయటకు పోలేక..
2853. గడియారమ్ముల్లులా నీవు..
నిముషాలనీ గంటలనీ సమన్వయం చేస్తూ..
2854. పెనవేస్తున్న నీ భావాలు..
మనసును పూదోట చేసేస్తూ..
2855. కులుకులు నేర్చిన కళ్ళు..
నిన్ను చదివిన ఆనందంలో..
2856. వెన్నెలకి తెలిసిపోయింది..
నిట్టూర్పుల సెగలో విరహం కాలిపోతుంటే..
2857. తడియారని బుగ్గలపై పెదవుల మండిపాటు..
నువ్విచ్చే కానుకలను నడుమనే కాజేస్తున్నాయని..
2858. మబ్బేసిందని గమనించనట్లున్నావు..
చీకట్లో నన్ను మరుపుతీగని మాయచేస్తూ..
2859. నవ్వులనావలోనే నేనొచ్చా..
విరహమై నాకోసం నువ్వెదురు చూస్తుంటావని..
2860. మరలిపోతున్న కలలు..
రాతిరంతా నేను కన్నులు మూయకుంటే..
2861. మౌనవించిన కోరికలు..
కదిలిన కన్నులు హృదయాన్ని బయటేస్తాయని..
2862. చిగురించానని గమనించలేదా..
నీ మనసు పచ్చిగా మారినా..
2863. పూజలు పుట్టింట్లోనే వదిలేసాను..
నట్టింట్లో నిన్ను ఏడిపించరాదనే..
2864. కట్టుబట్టలతో వచ్చేసాను..
ఆకట్టుకున్న నువ్వు అవమాన పడరాదనే
2865. గోలరాణిగా మారిపోయా..
నీ గుండేచప్పుళ్ళకు లయగా ఒదిగిపోవాలనే..
2866. అమాయకమవుతున్న పెదవులు..
సమానమైన ప్రేమను నుదుటికి పంచలేక..
2867. పులకింతల కానుకలు..
నీ తలపులు మల్లెలై పెనవేసాయని..
2868.
జారిపోతూనే ఉన్ననెందుకో..
ప్రేమలేపనం అనుకొని ఆముదాన్ని పూసుకొచ్చిందుకేమో
2869. వీడని బంధమై ముడిపడిన లతలు..
తీవెలోని బలమంతా వలపుగా కట్టేస్తూ..
2870. అహరహం పెరుగుతోంది నాలో విరహం..
వాడిన నవ్వుల పువ్వులే సాక్ష్యం.
2871. మునిపంట పూస్తున్నాయి..
వివశాల జలదరింపులు..
2872. పులకాంకురాలకే తెలుసేమో..
 వలపు పండించే ఎర్రదనాల నొక్కుళ్ళు.
2873. ఆనందహేలెందుకో తనువంతా..
ముద్దులు పంచుకున్నది పగడాల మోవైతే..
2874. నువ్వో మరువాలవాన..
నేనో పరువాలజాణనై ముసురుకున్న వేళ..
2875. నేను మీ ఊరెళ్ళిపోదామనుకున్నా..
నువ్వలా పొలిమేరలో విడిచేస్తే..
2876. మనసు నందనవనమైంది..
పారిజాతాలతో సంకెళ్ళు వేసిన సునిసత్వానికి..
2877. కురిసినప్పుడే అనుకున్నా..
సంపెంగి భావాలేవో గుట్టుగా తాకాయని..
2878. మోసినప్పుడే అనుకున్నా..
అంతరంగం తేలికయ్యిందని..
2879. జీవనరహస్యాన్ని తెలుసుకున్నా..
పూర్తిగా నష్టపోని ప్రయాణపు పొలిమేరల్లో..
2880. మోమాటపెడతావెందుకో బుగ్గల్ని..
అక్కర్లేని సిగ్గుల్ని అంటించి కవ్విస్తూ..
2881. మరుదివ్వెలా మారింది మనసు..
మల్లెకొమ్మవంటి మేనుకు అల్లుకోగానే..
2882. పోరాటం సెగలు రేపినందుకే..
ఆరాటం హుద్దులు చేరిపేస్తూ..
2883. విరులనే ఆవిరులు చేస్తావు..
ప్రేమసందేశాన్ని నేర్పుగా నాకందిస్తూ..
2884. స్వప్నాలకు సల్లాపాలు..
నీ చిరునవ్వులే స్వరాలై స్పర్శిస్తుంటే..
2885. మధురగీతం పెదవినంటింది..
అలవోకగా హృదయరాగాన్ని నువ్వు పంచినందుకే
2886. విచిత్రమే నేటి జీవనం..
వైవిధ్యం కోసం పోటీలు..అస్తిత్వం కోసం అసంతృప్తులు..
2887. పల్లె పట్టుకొమ్మ అరిగిపోయింది..
పట్నానికి యువత వలసపోతుంటే...
2888. ఆత్మవిమర్శతో ఆపేసా..
ఆనందానికి ఆవేశం అడ్డు రాకూడదని..
2889. ప్రేమ పరిఢవిల్లింది..
సరికొత్త పంధాల్లో జీవనమార్గాలు వెతుక్కుంటుంటే..
2890. అధికమవుతున్న కేరింతలు..
వ్యాపించిన ఆందానికి పుష్పించిన మాలికలు..
2891. ప్రియమైన స్నేహం..
పదాల పొందులో వికసించిన పుష్పం..
2892. రసానందమంతా నాదే..
నీ చెలిమి చిలుకపలుకు సొంతమైనవని..
2893.  చెలిమి చేమంతయ్యింది..
పచ్చగా మనసులో నువ్వు చేరగానే..
2894. హేమంతానికి వేడి పుడుతోంది..
వికసితకుసుమమైన  నన్ను వరించిందుకే..
2895. గ్రీష్మం తప్పుకుంది..
చైత్రం రధమెక్కి ఊహలోకి రమ్మంటుంటే..
2896. ఆమడదూరంపేసా ఋతువులన్నింటినీ..
మనసైన నువ్వు ముద్దబంతిలా చేరావని..
2897. సరసిజవే..
విరిజాజుల ఊయలలో మోహాన్ని పెంచుతూ..
2898. మించిపోతోంది సమయం..
మునిమాపులకు రమ్మని పున్నాగులు సందడిస్తుంటే..
2899. రేరాణిగా మాయచేసా..
మలి సంధ్యకే వెన్నెలగంధాలు పూయించి..
2900. గిలిగింతల గీతలతో నన్ను మైమరపిస్తావు..
తనువు కాగితంగా మారి చేరువైనందుకేమో..

..................................... ********.....................................

No comments:

Post a Comment