Wednesday, 18 November 2015

ద్విపదాలు : 1251 నుండి 1300 వరకు

..................................... ********.....................................

1251. తలుపులు కదిలిపోతున్నాయి..
భూకంపమని మరోమారు జనాలు భయపడతారనేమో..
1252. కధలన్నీ కంచికి చేరవేసావుగా..
వినడానికి తీరిక లేదన్నానని..
1253. గోరింటను సైతం నమ్మలేకున్నాను..
నిన్ను చూపక నన్ను తేలిగ్గా మోసం చేస్తోందని..
1254. మల్లెల గొడవేమిటో..
నిదురను దరిచేరనివ్వక నన్ను వేధిస్తూ..
1255. ఉపనదిగా మారిపోయా..
పయనమెటువైపైనా గమ్యం సంద్రమేనని తలచి..
1256. మనోగగనానికి ఆహ్వానించానందుకే..
మానస విహంగానివై నన్ను చేరతావనే..
1257. సీసాలను మరచిపోయా..
కందాలనే నువ్వాదరిస్తుంటే..
1258. బృందావనమేగా మాలికావనం..
రాధాకృష్ణులుగా మనమైపోతే..
1259. అక్షరమెప్పుడూ ఆలంబనమే..
ఆవేదనను రాసినా ఓర్చుకొని భరిస్తూ...
1260. ఆటవెలదినవుతా..
అల్లిబిల్లిగా నువ్వు పదాలతో ఆడిస్తుంటే..
1261. అమరమే అవుతున్నా..
నీ మనసామృతాన్ని పానం చేసినందుకు..
1262. ఉత్పలమాలలు ఉత్సాహపరుస్తున్నాయి..
చంపకమాలనూ చేయూతనిమ్మని..
1263. గగనమే చేతికందినట్లుంది నాకు..
మనసుకి రెక్కలు మొలిపించినందుకు..
1264. పుట్టి చచ్చిన నిన్నటికెందుకు దిగులు..
కన్నులు తుడుచుకు కొత్తఉదయానికై ఎదురుచూడక..
1265. ఆవేదన పూర్తిగా ఎగిరిపోయింది..
నిన్ను నాకు నివేదించుకున్నందుకే..
1266. జానపదమూ ఆడేస్తా..
జావళీలగా జంటొస్తానంటే
1267. ఆకాశానికి నిచ్చెనేస్తున్నాడందుకే..
శూన్యాన్ని ఒడిసిపట్టేందుకు..
1268. అంతరంగప్రేయసినని గ్రహించానప్పుడే..
నీ హావభావాల్లో అనురాగం ప్రకటితమైనప్పుడే
1269. మట్టి వాసన మొదలయ్యింది..
వానదేవుడు పుష్కరాలకి తరలినందుకేమో..
1270. గోదావరిగా మారిపోవాలనుకున్నా..
నీవు మునకేసేందుకు వస్తావని తెలిసినప్పుడే..
1271. గోదావరిగా మారిపోయానందుకే..
నిత్యవాహినై నీలో అనుక్షణం ప్రవహించాలనే..
1272. వశమైపోయా వెంటనే..
నీ హృదయాన్ని అద్దంలో తిలకించినందుకే..
1273. నీ మనసుదేగా గెలుపు..
పొంగిన గోదారి పయ్యెదలా..
1274. జ్ఞాపకమే మిగిలింది..
మంచు మిఠాయివంటూ మెల్లిగా దరిచేరినందుకే..
1275. పన్నెండేళ్ళ ఎదురుచూపు ఫలించిందిగా..
పుష్కరుడివై నీవొచ్చి నన్నల్లుకోగానే..
1276. వేరే అక్షరాలెందుకులే..
వెన్నెల సంతకమే చేసి పంపావుగా..
1277. గ్రీష్మమూ చల్లబడింది..
హేమంతపు మంచుపూల స్వప్నాన్ని తడిమినందుకే..
1278. నన్ను నేనే మరచిపోతున్నా..
నీ తలపుల గిజిగాడు అల్లరిగా నన్నల్లుకుపోతుంటే ఇందరిలో
1279. నన్ను నేనే మరచిపోతున్నా..
నా స్వప్నంలో నిన్నన్వేషిస్తూ
1280. . నన్ను నేనే మరచిపోతున్నా..
ఇరువురమొకటైన సంగమంలో మిగిలేదేముందని
1281. నన్ను నేనే మరచిపోతున్నా..
అస్తిత్వాన్ని వెతుక్కొనే ఆరాటమెక్కువై.
1282. మనసుకి మైకం కమ్మింది..
చూపులతో మత్తుమందు చల్లావేమో..
1283. కలలోనూ ఎదురుచూపులు..
రహస్యంగా కలుస్తానని నాకు మాటిచ్చావనే..
1284. ఎన్ని అబద్దపు తోరణాలు మనసు వాకిట కట్టాలో..
మది గదిలో నువ్వు భద్రమనే నిజాన్ని దాచేందుకు...
1285. స్మృతులలోనే సేద తీరుతున్నా..
వర్తమాన భారాన్ని మోయలేక..
1286. ఓడిపోయిన జ్ఞాపకాలు..
నా కన్నీళ్ళతో ఓదార్చలేనని నిస్సహాయతలో..
1287. అందాన్ని చిదిమేస్తుంటారు..
మనసుని ప్రేమించడం చేతగాని కుసంస్కారులు..
1288. మానసిక దౌర్బల్యం కొందరికి..
మనసుకి మసిపూసి నవ్వుకుంటారు..
1289. రెప్పలు బరువెక్కాయి..
నిన్ను మోయలేక అలసినందుకే కాబోలు..
1290. ఎదురుచూపులు కరువైయ్యాయనుకున్నా..
నిద్దురకై నిరీక్షిస్తూ నీరవంలో నిలబడ్డా
1291. అర్హతుండాలేమో..
ఆమెను ప్రేమించాలంటే అత్యాసొక్కటీ సరిపోదుగా..
1292. నీలోనే మునిగిపోతున్నా..
నీ రాగం కదనకుతూహలమై ముంచుతుంటే..
1293. నీ మనసు తెలిసింది...
చెలిమికై చేయి అందించినప్పుడే..
1294. స్వప్నాలు విలపించినందుకేమో..
కన్నీటిని కడిగేందుకు కన్నుల తాపత్రయం..
1295. గోదారై ప్రవహిస్తోంది మది..
పుష్కర వసంతమేదో వరించిందేమో..
1296. మనసు ముంగిట్లో ఆమని ప్రదక్షిణ..
నీ జ్ఞాపకాలను చల్లగా గుర్తుచేస్తూ..
1297. ఉరకలెత్తే భావాలెన్నో..
స్వాతిమాలగా నిన్నలంకరించాలని..
1298. పచ్చగా రాలిపోయింది..
పండిన ఆకొకటి శిశిరమొచ్చి తాకినందుకే..
1299. పెదవంచున కత్తి కట్టినట్లుంది..
మందహాసం దరి చేరనంటుంటే..
1300. మల్లెలు నవ్వుతున్నాయెందుకో..
నిన్నటి పున్నమిని తలచుకొని కాబోలు..


..................................... ********.....................................

No comments:

Post a Comment