Wednesday, 18 November 2015

ద్విపదాలు : 1051 నుండి 1100 వరకు

..................................... ********.....................................
1051. శూన్యానికి రంగులేసా..
నీ అన్వేషణకు దారి చూపాలనే..
1052. పగటికలలు నేర్చాయి కనులు..
రాతిరిని నీవు రావొద్దన్నావనే..
1053. అన్వేషణెందుకులే మానవత్వానికి..
చెమరిపుంటే చాలదా ఆ మనసుకి..
1054. ఆస్వాదించేసా ఆ క్షణాన్ని..
అన్వేషణలోనూ ఆనందం కలిగించిందనే..
1055. రాతిరి రానంటోంది..
కామాంధుల వికృతాలకి సాక్ష్యం కాలేక..
1056. అపురూపమై ముగిసింది..
అన్వేషించిన కల నిజమై ఎదురొచ్చి..
1057. తీరమై మురిసింది..
అనంతమైన అన్వేషణలో అలసి చేరువైన అలను చేరదీసి

1058. నాలో నిరీక్షణ మొదలుపెట్టు..
నీలోని నిన్ను కాజేసినందుకు..

1059. కనువిప్పింది ఆనందం..
మనసులో కురవాలనే
1060. క్లిష్టమైన అన్వేషణే జీవితం..
ఎప్పటికీ అంతమవని ముగింపులో..
1061. కలలో అన్వేషణెందుకు..
నిత్యగులాబినై నే ముందుండగా నిన్నలరించేందుకు..
1062. సహజత్వానికై అన్వేషణట..
కృత్రిమ జీవనాటకంలో మృగ్యమైన ప్రతీక్షణేగా..
1063. కడదాకా అన్వేషణేనేమో..
ఆనంద విషాద విలయతాండవాల విశ్లేషణల్లో..
1064. గగనమంటింది హృదయం..
మనసైన మాటలతో నన్ను తాకినందుకే..
1065. సత్యాన్వేషివే..
శిధిలాల్లోనూ ఆనవాలుకై తాపత్రయపడుతూ..
1066. ఆనందం ముందుందిగా...
కొంచం కారంగా...కొంచం గారంగా..
1067. జ్ఞాపకాల అరల్లో నిన్నెతకాలనుకున్నా...
చిత్రంగా  హృదయపుపొరలన్నిట్లో నీవే..
1068. దారి మరచిపోమాకు..
వెతుకులాటలో నీలో నువ్వే తప్పిపోయి..
1069. నిత్యసంతోషినే..
నిన్ను కనుగొన్న ఆనందంలో నేను..
1070. నీ మనసెంత మెత్తనో..
నా హృదయానికి ఒత్తుకుంది..
1071. తొలకరయ్యిందేమో నీ చిరునవ్వు..
నాలోని గ్రీష్మాన్ని తరిమేందుకు..
1072. చిరునవ్వింది చంగల్వ..
పూసేందుకు చెక్కిట్లో కాస్త చోటిచ్చానని..
1073. ఉద్రేకం కట్టెలు తెంచుకొంది..
ఎదురుతిరిగితేనే విముక్తి దొరుకుతుందనేమో..
1074. నిశ్శబ్దాన్ని ఛేదించే సంగీతమేమో అది..
వానకోయిలల గొంతులో మిళితమై మేల్కొల్పింది..
1075. రేచీకటనుకొని భ్రమపడ్డా..
పదేపదే పగలలా స్వప్నవీదులెంట తిరుగుతుంటే..
1076. వాడిపోగలదు వనమాలిక..
ఎప్పుడూ గ్రీష్మాన్నే తలచుకుంటే నీవు..
1077. నిదురకు మాత్రమే సొంతమైన కల..
మెలకువలో నన్ను చేరనని దూరమవుతూ..
1078. ద్వంద్వాలకు అతీతానివనుకున్నాను..
నీవలా మౌనముద్రలో అగుపడితే ప్రతినిత్యమూ..
1079. చాటువుని రాసాయేమో కనులు..
హృదయానికే పులకలు పుట్టిస్తూ..
1080. చిగురాకులకెన్ని ఆశలో..
నిర్జీవమైన పరికరంలో చెమరింపును ఆశిస్తూ..
1081. అనువదిస్తున్నా వీణమల్లే..
అనురాగం ఆలపించావనే..
1082. నా నవ్వులేగా కురిసింది..
పున్నమిని నీకు చూపించాలని..
1083. మౌనం తాండవించింది..
మృత్యురహస్యం తెలిసినందుకేనేమో..
1084. ఎన్నటికి కలవని ఊపిరులు..
రెండు అబద్దాలుగా కరిగిపోతూ..
1085. మనసే లేని కలలు కొన్ని..
చెక్కిళ్ళను సైతం చెమరింపుకు గురిచేస్తూ..
1086. కన్నీటికి వేగమెక్కువ..
అడ్డుకొనేలోపే నిన్ను తడమాలని ఉరకలేస్తూ..
1087. కన్నుల్లో మిగిలిపో కిరణమై..
రెపల్లో ఒదిగిపో కాటుకవై..
1088. సిగ్గుని చిదిమేసావుగా..
బుగ్గలను గిచ్చుతూ..
1089. కానుకనేగా నీ అధరాలకి..
పెదవంచు నవ్వులకు ఆధారాన్ని..
1090. మెరిసి మెరిసీ అలసిపోతున్నా..
మెరుపునై నీలోని గాఢాంథకారాన్ని తరమాలని ప్రయత్నించిన ప్రతిసారీ..
1091. కాగితమూ చెమరిస్తోంది..
మనసుగీతం ఆశిస్తే కన్నీటిని రాస్తున్నావని..
1092. నా కళ్ళెప్పుడూ మందారాలే..
నీకై వేచిన వియోగసీమల్లో..
1093. చూపుల శూలాలే..
మెత్తనై గుచ్చి మదిని మేల్కొల్పుతూ..
1094. మనసు రంజిల్లింది..
నా కులుకు కనిపెట్టినందుకో..నీ మాటల జల్లుకో..
1095. కన్నీళ్ళేనాడో జారాయి..
కలనుకొని నీవు రెప్పలు విప్పినప్పుడే..
1096. కాలం శిలైతే బాగుండేది..
శిల్పిగా మరోమారు చెక్కుకొనేందుకు..
1097. మేఘసందేశం పంపానందుకే..
విరహవేదనలో వింతైన ఆలోచనలు చేస్తావనే..
1098. విరహమై మిగిలావెందుకో..
ప్రేమజల్లు కురిపిస్తావనే ఆకాశానికేసి చూస్తుంటే..
1099. నమ్మకం నిర్వీర్యమయ్యిందిగా..
కళ్ళూ, చెవులూ మోసం చేస్తుంటే..
1100. భావుకత్వం సడలిపోయింది..
అనుభవాల కొలిమిలో అనుభూతులు మాడిపోయినందుకే..
..................................... ********.....................................

No comments:

Post a Comment