Monday, 16 November 2015

ద్విపదాలు : 001 నుండి 050 వరకు

..................................... ********.....................................

1. శ్వాసకిన్నాళ్ళకు తెలిసిందేమో..
మట్టికి పరిమళమెక్కువని..

2. కస్తూరి పరిమళమేగా నీ శ్వాస..
అనుమతి తీసుకోకనే మహారాణిని అయిపోయానందుకే..:)

3. తెలీకుండానే చేరిందిగా..
నీ ఊపిరిలో తానే ఉండాలంటూ నా శ్వాస..!

4. అసలెవరనుమతి తీసుకోవాలో..
భ్రష్టుడైన ఆగంతకుని ఆఖరిశ్వాసను తీసేసేందుకు..

5. సంజీవనే కావాలి నా శ్వాస..
ఆ'రాధ'నేనై నీలో ప్రాణమున్నంత వరకూ..

6. శ్వాసకెప్పుడూ మోహాలే..
తీరని దాహాల మరీచికల కోరికలతో..:(

7. శిశిరం వెనుతిరిగింది ఓడిపోయేనేమో..
సంజీవినై నీలో కలిసి శ్వాసించాలనే కోరికను రాల్చలేక..

8. అంతఃకరణ జరిగిపోతోంది అంతర్లీనంగా నాలో
శ్వాస మీద ధ్యాసను మనసలవరచుకున్నందుకే..:

9. సనాతనభావాలేనట..
వేషభాషల్లోనే కానీ మనసుల్లో కాదట..:(

10. భావాల విందులెన్నో
నీవెంచక్కా నలుగురికీ వండి వడ్డిస్తుంటే..

11. జుంటిమోవి జివ్వుమంది..
అధరాల అందాన్ని అంతలా పొగిడావని.

12. రాలుగాయిరాగాలేగా అన్నీ
రవ్వంత రవళించని నీ మౌనానికి

13. అమృతపుచినుకులే కురిసాయిగా
నువు నాటిన విత్తులు మొలకెత్తించేందుకు

14. మౌనం అలుసిచ్చింది
మాటల్ని ఓడించి

15. మౌనరాగాన్ని అభ్యసిస్తోందట
ఏ సౌందర్యాన్ని పాడాలనో చైత్రకోయిల.

16. అరుణరాగపు రహస్యం చెప్పుంటాడు..
సిగ్గుల అరుణిమయ్యింది ఆకాశం..

17. మౌనం అసూయపడుతోంది
మాటల్ని దాస్తోందని..

18. నా భావావేశం పొంగుతోంది..
నీ మాటలలా తడుముతుంటే

19. .మల్లెనవ్వుల చిలిపి అధరాలే నావి
వేసంగిలో సైతం చల్లని వెన్నెలీనుతూ..

20. మనోగతమే మరచిపోతున్నా..
నీ ఆలోచనల్లో తెలియకుండానే ఐక్యమయ్యి..

21. వాకిట్లో నిలబెట్టాగా నవ్వుల్ని
నీకు స్వాగతం చెప్తాయనే..:)

22. రాగోదయమే..
నీ గారాలపిలుపులు శ్రావ్యంగా మేలుకొల్పుతూ.

23. ఆపవుగా నిరంతరాన్వేషణ
మకరందపుఊబిలో మరింత మధురంగా కూరుకుపోతూ..

24. ముద్దులేగా సద్దు..
మౌనాన్ని ముగించేందుకు..

25. మిన్నంటిన ఆనందాలేమో..
మనకోసం వెలిగినట్లున్న ఆకాశ తారలమ్మలు..! 

26. నిన్నునీవే మరచావేమో
మనిషిని చూడాలనుకొని మృగాల కంటపడి

27. అడవిలో అన్నవే
అమాయక గిరిజనులకు ఆత్మీయంగా తోడవుతూ..

28. వెలిగించా అక్షరజ్యోతులను
సాహితీవనం వెన్నెలను మించి వెలిగేలా..

29. భావాల గర్భం బరువెక్కింది..
నీ సమక్షంలో పురుడోసుకుందామనే..:

30. అమృతచినుకులేగా అవి..
మనల్ని తడిపి తీపిగా మార్చినది

31. నేనెప్పుడూ మకుటాన్నే
మాలికలపై అలంకరించినందుకే

32. వికసిస్తున్నా చిరునవ్వులతో..
సూర్యకాంతిపువ్వునై నీ చుట్టూ తిరిగినంతనే.

33. మనసుకెన్ని తమకములో..
కోయిల రాగాన్ని తర్జుమా చేసినందుకో

34. చినబోతోంది చెలిమి..
చెలి అంటూనే నిష్ఠూరాలతో నిందిస్తుంటే

35. నీలాలెంతగా కరిగాయో..
నీకర్ధమయ్యే భాషలో తమను అనువదించుకొనేందుకే

36. రెప్పైనా వెయ్యవుగా
సస్మితవదనం శాశ్వతంగా నీ తోడయ్యిందని..:

37. కలలన్నీ కమనీయమే
రెప్పల్లో నీవుంటే..

38. అందుకున్నా కానుకని
వర్తమానమై వచ్చావనే..

39. కనికరించని కాలమట
రాగాలతో చేరి అనురాగాన్ని మరచావనే

40. మనిషిగానే మిగిలుంటా
మానవత్వం తోడైనందుకు

41. గెలిచేసా ప్రయోగంలో
బలహీనక్షణాల్ని ఓడించేసి

42. వెతలన్నీ కధలేగా..
నిజాలన్నీ కలలేనని మనసున ఊహిస్తే

43. కదులుతున్నావుగా కాలనికనుగుణంగా
మార్పుల్ని సైతం మోసుకుంటూ ఆనందంగా..

44. నీ మనసుదెంత వేదనో
కూనిరాగమూ ఖూనీ అయిపోతూ

45. పరుగెత్తి ఒకచోట ఆగాల్సిందేగా
చివరికి మట్టిలో కలవాల్సిందేగా

46. తీపి కలయికనే ఆశించాను..
మధుమేహమై ముట్టడిస్తావని తెలియక

47. ఎంత నటిస్తేనేమి..
దూదిపింజెల్లో తేలిపోయిందిగా

48. ఎలకోయిలకెన్ని రాగాలో
తలపులచివురులు మెక్కినందుకే

49. బానే శబ్దం చేస్తోంది
నిట్టూర్పు తాళం తోడయినట్లుంది..

50. జయిస్తున్నా బలహీనక్షణాల్ని
నాలో ఆనందాన్ని నేనే వెతుక్కుంటూ

..................................... ********.....................................

No comments:

Post a Comment