Thursday, 19 November 2015

ద్విపదాలు : 2501 నుండి 2550 వరకు

..................................... ********.....................................
2501. మమేకమేగా మనమిద్దరం..
ఒక్కరిలో ఒకరమై వీడని లోకమయ్యాక
2502. బాదంకాయలు తిన్నానని తిట్టబోకు..
నా పెదవులెప్పట్నుంచో ఎర్రనే..
2503. తొందరపడవద్దన్నా భావాలను..
నీలో తపన ఎంతుందో చూద్దామని..
2504. సరికొత్త దారుల్లో ప్రవహిస్తున్నట్లుంది రక్తం..
నా వియోగాన్ని కవిత్వంలో కలిపినందుకే..
2505. చెలియలకట్టవుదామనుకుంది చెక్కిలి..
కన్నీటిని కనుపాపల్లో నువ్వలా బంధించకపోయుంటే..
2506. ఆత్రేయుడివని ఒప్పుకుంటున్నాలే..
పున్నమినాడే సురుచిర ప్రణయభావాల్ని రేకెత్తించినందుకు..
2507. కృష్ణుడివో కాదోనని సందేహిస్తున్నా..
నువ్వలా దూరంగా నిలబడితే..
2508. నిజానుభవం కరిగిపోతోంది..
నన్ను చేరేలోపే నాని ఉన్నందుకు..
2509. అలజడిని తొలగించేసా..
అలలుగా మారి నీ హృదిలో మెత్తగా సాగిపోవాలనే..
2510. సందేశం సిద్ధించింది..
నివేదించిన ప్రేమను సమ్యోగంగా మార్చి..
2511. కొన్ని రాగాలు శాశ్వతాలే..
పాడకపోయినా హృదయాన్నే అనుసరిస్తూ..
2512. వధించాలనుకున్నా ప్రేమను..
శిశిరమైన విరహం నన్నిడిచిపెట్టేలా లేదని.
2513. ఆనందనాట్యమాడుతోంది మది..
నీ మనసులో మాట రాబట్టిందని..
2514. మరోరూపంతోనూ కనిపిస్తున్నావెందుకో..
నెత్తిమీద గంగమ్మ తొంగి చూస్తుననందుకేమో..
2515. నిన్న కురిస్తేనేమి వెన్నెల..
నేటికీ మనసును రాజేస్తోందిగా..
2516. చరణాల్నే మార్చేసా..
నీ అపశృతిని శృతిలోకి రప్పించాలనే..
2517. పాత్ర నిడివి పెంచేద్దామని యోచిస్తున్నా..
నీ విశ్వరూపానికి నీరాజనాలు సరిపోవని..
2518. గమనం మార్చుకున్నా..
నిరీక్షణా అసహనంలో గమ్యాన్ని మరచినందుకే..
2519. జన్మజన్మలకూ సరిపోని బంధమే మనది..
నిజంలో జీవించి నాటకానికి తెరేసినందుకు..
2520. వలపుజల్లు వరదవుతానంది..
అడ్డుకట్టేసే చీకట్లో మెరుపొకటి మెరిసిందనే..
2521. ఆశ్చర్యం నావంతవుతోంది నేడు..
నీ పిలుపుకే పున్నమవుతుంటే..
2522. నీరెండలెంత నవ్వుకుంటున్నాయో..
నిన్నూ నీ నీడనూ కలిపినందుకేనేమో..
2523. గుప్పిళ్ళు తెరిచేసానందుకే..
నిన్ను నాలో దాచుకున్న రహస్యాన్ని నలుగురికీ పంచాలనే
2524. గతం తీయలేనిదేగా వర్తమానం భవిష్యత్తైనా..
తీయంగా నా మనసును తీర్చినందుకు..
2525. భాద్రపదం మురిసిపోతోంది..
కనీసం నిన్నైనా తేనెజల్లుల్లో తడిపిందని..
2526. పల్లవాలన్నీ కులుకుతున్నాయి..
పువ్వులతో చెలిని పోల్చగా ముకుళించుకున్నాయని..
2527. ఉత్ప్రేరకాలెందుకు నాకిక..
ఉపమానాలే నువ్వయ్యాక..
2528. తడబడుతున్న అక్షరాలు..
ప్రణయ భావాలతో నువ్వు ఉరకలెత్తిస్తుంటే..
2529. నీలోకే వచ్చి చేరుకున్నా..
మనమిద్దరం ఒక్కటని నమ్మినందుకే..
2530. అంబరమేగా ఆనందం..
నీవంత తీయగా శుభోదయాన్ని చిలకరిస్తే..
2531. ఆమడదూరమయ్యింది దిగులు..
మనవైన బంగారుక్షణాలను మాత్రమే ఆహ్వానిస్తున్నానని
2532. వన్నెలద్దడం నేర్చుకుంటున్నా జీవితానికి..
సరికొత్త ఉపమానాలను ప్రయోగిస్తూనే..
2533. దిగులు బయటపెట్టని కలువ..
కోనేట్లో నీరున్నా దాహమేస్తుందంటే లోకం నవ్వుతుందని గ్రహించుకొని
2534. గుప్పెడు దిగులే..
గుండెలో చేరి గునపంలా గుచ్చేస్తూ..
2535. అతడు స్పష్టమే..
ఆమె ప్రేమలో గుడ్డితనానికి ఆసరా ఇచ్చినట్లు నటిస్తూ..
2536. శాశ్వతమయ్యింది దిగులు..
వసంతంలా నువ్వొచ్చి శిశిరానికి నన్నిడిచిపెట్టాక
2537. గుండె కవాటం తెరిచుంచావుందుకో..
మరెవరికైనా రావాలనిపిస్తే రావొచ్చంటూ..
2538. బాలకార్మికుల దిగులెంత దయనీయమో..
ఆదుకొనే మనసుకై ఎదురుచూపుల్లో..
2539. పండువెన్నెలయ్యింది సంతోషం..
దిగులు మేఘాలను అలవోకగా తరిమావనే..
2540. ప్రేమను వెదజల్లావుగా..
దిగులుపడ్డ విరహాన్ని చిరునవ్వుతో జయించేసి..
2541. ఆనందపారవస్యమే కన్నుల్లో..
అభినయాన్ని నువ్వలా రెప్పేయక తిలకిస్తుంటే..
2542. వగలుగా వాన..
రైతన్న దిగులుతో సంబంధం లేదన్నట్లు..
2543. దిగులొచ్చి పోతేనేముందిలే..
పెదవులకు పువ్వుల మెత్తదనాన్ని పరిచయించిందిగా..
2544. గమ్యమెరుగని దిగులు..
మనసుపొరల మర్మరధ్వనుల్లో అస్తవ్యస్తమై తిరుగాడుతూ..
2545. అలవాటయ్యింది దిగులానాడే..
ప్రకృతిని కాంతతో పోల్చి చెప్పినప్పుడే..
2546. దిగులే మిగిలింది..
నాకేమీ కాలేక నన్ను వీడావని..
2547. పరిమళిస్తోంది దిగులు..
మనసులోపలి మల్లెపొరల్లో నిన్ను దాచాననేమో..
2548. దిగులూ పండుగవుతోంది పాపం..
నువ్వు తలపుకొస్తే చాలనుకుంటూ..
2549. కమ్మగానే కమ్ముకుంది దిగులు..
తీయని గుబులును పరిచయించావని..
2550. మనసుకెంత పులకింతో..
వయసు దిగులును తర్జుమా చేసుకుంటూ..
..................................... ********.....................................

No comments:

Post a Comment