Wednesday, 18 November 2015

ద్విపదాలు : 1401 నుండి 1450 వరకు

..................................... ********.....................................

1401. మాటలకి చోటేది..
నీ సమక్షంలో ముద్దులవానే కురిసిపోతుంటే..
1402. బాగుంది నవ్వుల ఉపహారం..
అల్పాహారమై మదిని నింపేస్తూ..
1403. అల్పసంతోషమనుకుంటా..
చారడేసి కన్నుల్లోంచి తొంగిచూసే కన్నీరు
1404. మనసు కరిగిందిన్నాళ్ళకు..
నీ మువ్వలరాగాలు మెత్తగా తడిమినందుకే..
1405. వలపు నవ్విందిన్నాళ్ళకు..
నా మెరుపును పూసుకోవడం మొదలెట్టాక..
1406. సెలయేరై రమ్మని ఆహ్వానించావుగా..
చెక్కిలిగింతలకే మెలికెలు తిరిగిపోతావే..
1407. అనువణువులో ఆనందం ప్రవహిస్తోంది..
చూపులు కలిసిన ప్రతిసారీ..
1408. పరువానికి వృద్దాప్యమెప్పుడూ లోకువే..
తనకి ముందుందని తెలిసినా..
1409. రెప్పలు మూయలేకున్నా..
కన్నుల ముందు నీవున్నట్లు అనిపించినందుకే
1410. నీ ఊహలకు సారధి నేనేగా..
ఎన్నో లోకాలను నీకు పరిచయిస్తూ..
1411. రాదారి పూదారయింది..
నీవు నడచిన ఆనవాళ్ళను చెప్పిందనే
1412. ప్రాణం పోతోంది..
నీలో చేరి ఊపిరాడనట్లు అయ్యిందనే..
1413. పురుషోత్తములని పొరబడ్డాం..
అహంకారపు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని తెలియక..
1414. అక్షయమయ్యాయి కావ్యాలు..
హృదయం గాయపడిందనే..
1415. జన్మాంతరయానం మొదలయ్యిందేమో..
క్షణం తీరుకెరుగని మహాత్ముని అడుగులకి..
1416. నిజం చేస్తామనేమో..
నీ కలలను మా కన్నుల్లో నింపి నింగికెగిసావు
1417. సముద్రమూ కన్నీరుమున్నీరయ్యింది..
కర్మర్షి నిష్క్రమణతో రామేశ్వరం ఒంటరయ్యిందని..
1418. శోకసంద్రంలో ఎర్రబడిన కనులు..
కలలు కల్లలు కాకూడదనే..
1419. సామాజిక ప్రయోజనం సిద్ధించేదెన్నడో..
అక్షరాలు వృధా కానివ్వకుండా..
1420. అక్షరం చేసుకున్న అదృష్టమేమో..
సందేశాన్ని అర్ధవంతంగా చేరవేస్తూ..
1421. విచ్చేస్తాలే వసంతమై..
నీ కలను బ్రతికించి చూపేందుకు..
1422. మహేంద్రజాలమే..
పెదవులను తోసిరాజని చెక్కిళ్ళు కెంపులవడం..
1423. మనసుకదో అభిమానం..
అభిరుచిని కలుపుకు మరీ ముడేసుకోవడం..
1424.కమ్మని కల...
మన మనసులొకటై విరహాన్ని దూరంచేసినట్లు..
1425. నీ తొలిచూపొక పరిచయం..
మలి చూపు పడకుంటే మదిలో ఏదో కలవరం..!!
1426. అలుకలు తీరుస్తావు...
పంచ తారల మధురిమలతో..మది కోనేటిలో జలాలూరిస్తూ..
1427. తీయనిదే తొలివలపు...
హృదయములో తేనెజల్లు కురిపిస్తూ..వేసవిలో గ్రీష్మతాపం మరిపిస్తూ.
1428. అక్షరం అవసరమే..
కాని ప్రతిభ మాత్రం శాశ్వతం..
1429. గాలికబుర్లు చాలిక..
వెన్నెల్లో విహారానికి పిలిచావని నేనొస్తే..
1430.  రెప్పలకీ కానుక కావాలేమో..
హృదయపూర్వక ఆహ్వానం చాలదేమో..
1431.  నా చిటపటనవ్వులన్నీ నీకిచ్చేసా
నీ అందెల్లో శృతికావాలనే..
1432.  నా మువ్వల సవ్వడిలో దాచే్సా.
నీ నవ్వులు నాకే సొంతమవ్వాలని
1433.  మంచితనపు మరువంతో మత్తిల్లావు..
హృదయపు కోవెలలో కొలువయ్యావు..
1434.  అలతి పదాల అల్లికలే..
అపురూపమై అణువణువూ నిండుతూ
1435.  అమరమే నా వలపు..
జన్మజన్మలకీ వీడని నీడంటూ.
1436.  నాకుతెలుసుగా..
జిగిబిగి అల్లికలు నీకు మాత్రమే సొంతమని..
1437.  చెక్కిళ్ళ చెమరింపే..
తనువంతా కమ్మింది పులకింతల గిలిగింతై.
1438.  నీ మనసుకి కళ్ళు అతికించావేమో..
శిల్పానికి ప్రాణం వచ్చిందని కనుగొన్నావుగా..
1439.  వలచిన వనితకే వలపంతా..
ప్రవరాఖ్యుడివై నీవు దాటేస్తుంటే.
1440.  నీ లేలేతభావాల్లో బంధీనవుతున్నా..
ఏకాంతంలో ఏర్చికూర్చి అల్లావనేమో..:
1441.  అతిశయమే నీ మౌనానికీ..
పెదవిప్పకుండా గుట్టు మొత్తం చెప్పేస్తూ..
1442. అనుభూతులే గెలిచేది.
భావాల తులాభారంలో..
1443. అతిశయమే నా గాత్రానికి..
పెదవిప్పితే వెన్నెల కురుస్తుందేమోనని..:
1444.  చుక్కల్లో చిక్కుకుపోయా..
అర్ధం కాని మెలికలతో ముడేస్తుంటే..
1445.  గతమెప్పుడూ అమూల్యమే..
వెలకట్టలేని వర్తమానంలో.
1446.  నేనూ ఓడిపోతున్నాను..
రెప్పలు తెరిస్తే కనుమరుగయ్యే నీ రూపం వెతకలేక..!
1447.  భూమాతకు నిత్యసంక్రాంతే
పచ్చనిపైరుల నాట్యంతో సంపెంగిసొగసుల సువాసనలతో..
1448.  భూదేవి బుగ్గలకెన్ని కెంపులో..
పులకింతలకే పుంతలు తొక్కిస్తూ
1449.  వేడుకుంటోంది మనసు..
ముసుగు మనిషిని మాత్రం ప్రేమించొద్దంటూ
1450.  గతం గిరికీలు కొడుతుంది..
గాలిపటం విడిచినంత తేలిగ్గా తనను విడిచావని కాబోలు.

..................................... ********.....................................

No comments:

Post a Comment