Thursday, 19 November 2015

ద్విపదాలు : 2001 నుండి 2050 వరకు

..................................... ********.....................................

2001. అమ్మే అమృతం..
తనలో ప్రాణాన్ని మనకి పోసినందుకు..
2002. రహస్యస్పర్శకెన్ని మధురాలో..
నిజమైతే కలవరాలేమో..
2003. అతుకులబొంతగా మారింది జీవితం..
చిరుగులను దాచాలని ప్రయత్నించినందుకే..
2004. ఆరుద్రపురుగునై వెలుగులీనుతున్నా..
నిశీధిచీకట్లను నీకు దూరం చేయాలనే..
2005. శ్రావణపుజల్లు గిచ్చుతోంది..
నీ తొలిచూపు గిలిగింతను గుర్తుచేస్తూ..
2006. రాతిరి కోసం ఎదురుచూస్తున్నా...
కలనైనా నిన్ను చేరేందుకు..
2007. పేరులేని పువ్వైతేనేమి..
ప్రకృతి మందహాసం స్పృసిస్తూనే ఉందిగా..
2008. కాలాతీత గాయలేందుకో..
కన్నులనే పట్టిపీడిస్తుంటాయి..
2009. మనోధైర్యాన్ని సాయమడుగు..
విజయ సోపానానికి దారి చూపగలదు....
2010. జీవితం అక్షయం కావాలనుకున్నా..
బాధిస్తున్న ప్రణయరహస్యాన్ని చేధించాలని..
2011. నిద్దురెక్కువే నీరాతిరికి..
నేనే కలను కావాలనే ఆకాంక్షలో..
2012. కలలు జారిపోయాయి..
నువ్వు విబేధించిన ప్రణయంలో కరిగి..
2013. నీ తలపు కవ్విస్తుంది..
అక్కరకు రాలేని ఆవేదనలో..
2014. విముక్తిపర్వం చివరిదేమో..
భవబంధాలను దూరంచేస్తూ..
2015. సిగ్గిల్లిన సోయగం..
నీ మాటలకు మత్తిల్లి వివశమవుతూ..
2016. వెన్నెలతో భాషిస్తున్నా..
మౌనవించిన మనసుకు రవ్వంతనుభూతి పంచాలనే..
2017. కలలోనే కన్నుమూయాలనుకున్నా..
నీ వియోగం శాశ్వతమని భరించలేక..
2018. సంతోషం సాగరమయ్యింది..
అలనై నిన్ను కమ్ముకొని ముంచెత్తాలనే..
2019. వాహినిగా ప్రవహిస్తూ స్వరాలు..
శ్రావణమేఘాలను ఒక్కమారైనా కరిగిస్తామంటూ
2020. వెన్నెల్లో లీనమయినట్లుంది...
నీ చిరుతనవ్వుల్లో నే విలీనమయినందుకు....
2021. బాల్యమంతటా మురిపాలే..
అమ్మానాన్నల గారంలో మమకారాలు ఉప్పొంగుతూ..
2022. అబద్దం వెనుకాలే నిజమెప్పుడూ..
అవకాశమొస్తే బయట పడాలనుకుంటూ..
2023. నిశ్శబ్దం నిద్దురపోయింది..
మనసు చేసే సద్దుకి చోటిచ్చి..
2024. వెన్నెల్లో విలీనమయిపోయా..
నీ మనసద్దంలో నన్ను చూసుకున్నందుకే..
2025. ఓటమి తిరిగిపోయింది..
గెలుపును హత్తుకొని నువ్వు ముందడుగేసినందుకే..
2026. కనపడని ముళ్ళే కొన్ని..
అదేపనిగా లోతుగా గుచ్చుతూ..
2027. ఉదయానికే అందమొచ్చింది..
పెదవులు అరుణిమలై సుప్రభాతాన్ని తలపిస్తుంటే..
2028. పంచేసానందుకే ప్రేమని..
నీ హృదయంలో మరోమెట్టు ఎక్కానని..
2029. వియోగంలో విహరించినప్పుడే తెలిసింది..
కలనైనా దూరమవడం దుర్లభమని..
2030. పొలిమేరల్లో పనేముందో..
నీ మనసెప్పుడూ సరిహద్దులపైనే కన్నేస్తూ..
2031. ప్రమోదమే మనసుకి..
అవసరమైన చెలిమిని అడక్కుండానే అందించావని..
2032. నీ కలలో నేను..
మనసు కోరిన ముచ్చటలా..
2033. నా హృదయం తేలికయ్యింది..
బరువంతా నువ్వు పంచుకున్నావని..
2034. కాలం కర్కశమయ్యింది..
సంతోషం అనుభవించేలోపే విషాదాన్ని పరిచయిస్తూ..
2035. కన్నీటితోనే తడపాలేమో హృదయాన్ని..
మానవత్వం చిగురించాలనే కోరికుంటే..
2036. వెలకట్టలేనిదే ఆనందం..
మనసులోనే దాగుండి విలువను పెంచుకుపోతూంటే..
2037. సవ్యసాచే మహిళ..
పొత్తిళ్ళనుండీ ఒత్తిళ్ళవరకూ అతనికి చేయూతనిస్తూ..
2038. కిన్నెరవీణ మూగబోయింది..
సాధనలో నువ్వందించే స్వరమధురిమలు తోడవ్వలేదనే..
2039. సఫలతలో నువ్వో కెరటమే..
వెనుకకు మళ్ళినా ముందుకొస్తూ..
2040. మౌనంతో పనేముందిలే..
మాటలతో పాఠాలు వల్లెవేయించడం అలవాటయ్యాక...
2041. వెలిసిపోతున్న భావాలు..
అక్షరంలో మెరిసినా నువ్వు మురవలేదని..
2042. గులాబీతో పోల్చొద్దన్నానందుకే..
కాడ పట్టుకొని గుచ్చుకుందని మొరపెడతావనే..
2043. నీ పలకరింపే ఓ పరిమళం..
వేరే గులాబులెందుకు మనమధ్య దండగ..
2044. భావాలకు ఆజ్యం పోస్తున్నావుగా..
మనసంతా మల్లెకొమ్మేదో అల్లినట్లు..
2045. నీ చిలిపినవ్వులకే కరిగిపోతున్నా..
నావైపు అల్లరిగా చూసావని..
2046. బీడయినప్పుడు తెలిసింది..
మనమధ్య పచ్చదనం రాలి చానాళ్ళయిందని..
2047. నాస్తికురాలిగా మారిపోయా..
నా మనోభావాన్ని ఘోరంగా అవమానిస్తున్నావనే..
2048. సౌందర్యస్నానం చేయిస్తున్నావనుకున్నా..
గులాబీవంటూ కన్నీటిలో తడిపావని గ్రహించక..
2049. జరగబోయేది చూస్తున్నా..
ముగిసిపోయిన ప్రేమ గురించి ఇప్పుడెందుకని..
2050. నీ కనుసన్నలలో నేను..
మిగతావి అనవసరమని గుర్తించి..
..................................... ********.....................................

No comments:

Post a Comment