Wednesday, 18 November 2015

ద్విపదాలు : 401 నుండి 450 వరకు

..................................... ********.....................................

401. చచ్చిన నిన్నటి గురించి ఆలోచనెందుకు..
పుట్టబోయే రేపటిని హాయిగా ప్రేమించక..

402. నీ మనసువేనేమో పరిమళాలు..
భావాల అత్తర్లుగా మారుతూ..

403. ఎక్కడని దాచేది అల్లరిని..
చలాకీకలువనని నువ్వు కనిపెట్టేసాక..

404. ఎగిరే పావురానివేగా..
మదిలోనూ అందనంత ఎత్తునే ఎగురుతూ..

405. స్నేహపరిమళం వీస్తోంది..
నిన్ను తాకిన గాలి మోసుకొచ్చిందనేమో..

406. మొలుస్తూనే ఉన్నాయిగా..
ఆశలరెక్కలు అనంతమై నీలో గగనానికెగిరేందుకు..

407. అల్లరీల్లికలే మనవి..
మనసును అల్లిబిల్లిగా ఒకటిచేసి ముడేస్తూ..

408. జాబిల్లివనే కొలిచాను..
అందని వరాలు అలవోకగా తీరుస్తావని..

409. కాపురానికొచ్చాననే అలుసయ్యింది..
అలవికాని ఆరళ్ళు పెడుతూ నీ దయలేని మనసు

410. ఎంతకని రాయను కన్నీటిని..
కరుణరసం ఇష్టమన్నావని నీకోసం..

411. కథాపారిజాతాన్నే అంటావు..
అంకితమిచ్చేదాకా ఎదురుచూడమంటూ నా మనసుని..

412. అంకితమయ్యానుగా అపరంజిలా నేను..
మదనుడివై మనసుకి నచ్చావని..

413. నీ మనసలంకరించింది చాలులే..
వేరే సిం హాసనమే కోరనిక..

414. వలపులవేట ముగించాను..
నీ బాణాలకి నవ్వులతో బదులిచ్చి..

415. నిన్నల్లో రాలిపోయానుగా..
నేడు వసంతమని గమనించేదెలా నేను..

416. అనుభూతి ప్రవహిస్తోంది వెన్నులోకి..
భావమై మాలికలో ఒదిగేందుకేమో..

417. నువ్వు మనసయ్యావనే..
నా తనువులో వీణలు మ్రోగింది..

418. అపరంజిని తోడిచ్చిందిగా ఆమని.
నీవు ఏకాకివి కాకూడదని..

419. అరటిపువ్వురెక్కవుతోంది మది..
నిన్ను భద్రంగా దాచుకోవాలని భావించినందుకేమో..

420. వెన్నెలపువ్వుని నేనేగా..
నా రాతిరికి నువ్వు రాజువైతే

421. మేఘాంచలాల కన్నీరైతేనేమి..
కడలిహృదయంలో తడిని చేర్చేందుకే కురిసిందిగా..

422. మాలతీలతనేగా నేను..
నీ మనసును పెనవేసి విరిసేవేళ

423. పులకరించిన పలుకులేగా అవి..
నీ గారానికి పుట్టినవనని..

424. గుప్పెడునవ్వులు చాలునేమో..
నీ మనసుకి పువ్వులపందిరి వేసేందుకు..

425. సందేహంతోనూ ఊయలేసేస్తావు..
నీ మనసు పందిరి గట్టిదేనేమో..

426. ఏకాంతకోనలన్నీ మనవేగా..
క్షణక్షణం తోడుండి మనం పయనిస్తే

427. స్వాతిచినుకులేమో మరి..
అందాన్ని సంతరించుకొని నిన్ను తడిపాయంటే..

428.కురులతో పనేముందిలే..
కన్నుల్లో వెన్నెలై పూయగలిగే నాకు..

429. అందరికీ రాని అదృష్టమేగా..
అనుభూతిని మాటల్లోకనే ఆనందం..

430. నాలుగువిత్తులేసినా చాలుగా.
నీ మదిలో నే మొలకెత్తేందుకు

431. శిశిరం వేనుకే నిలబడిపోయిందిట..
నన్ను ఆమనిరథం ఎక్కించినప్పుడే..

432. ఆదమరచిపోతావెలా..
నా తలపులులు నిన్ను తడమలేదనా..

433. మనోగవాక్షం విచ్చుకుందేమో..
భావవిహంగం ఆకశమై అనంతంలో ఎగిరింది..

434. వట్టివేళ్ళకన్నా గట్టివేలే..
నిన్ను పెనవేసిన నా వలపులు..

435. ఎదురింటివాళ్ళమే..
ఏ విషయంలోనూ కలిపించుకోము సుమా..

436. ఎన్ని లయలో నా నవ్వులో..
నీ మనసులో మువ్వకో తాళమేస్తూ..

437. ఎగిసిపడే అవకాశం వచ్చిందిగా నీకు..
ఆకాశానికి నిచ్చెనలేకుండా అలవోకగా ఎగిరేందుకు..

438. నా ఎదసవ్వడి నీదేలే..
నీలో అనురాగాన్ని నింపేందుకు

439. నా కంటికెప్పుడూ తీయని గుబులే..
నిద్రొస్తే నిన్ను కలలో కలవొచ్చని..

440. జతగాడివే అనుకున్నాను..
నా మనసు నీకై పరుగుతీస్తున్నందుకే..

441. లావణ్యలతికనే..
కర్పూరదీపకళికలా మెరుస్తూ నీలో..

442. ముఖకవళికల మహిమది..
మన ఆనందాన్ని తారుమారు చేసేస్తూ..

443. ఎగిసిన సొగసే..
నీ సోగకళ్ళ సైగలకు వివశమై..

444. సతమతమవుతోంది మది..
అలవికాని అనుభూతిని తట్టుకోలేకే కాబోలు..

445. వింతాకర్షణేమో నీ చూపుది..
కాటుకకళ్ళ హద్దుల్ని చెరిపేస్తూ..

446. ఎన్ని మంచుముక్కలు తిన్నావో..
వేసవి విరహాన్ని తగ్గించాలని..

447. చిత్తయ్యానెప్పుడో..
నా భావమొలకలకు పూసిన పువ్వును చూసినందుకే

448. భావాల ఆకృతులేమో అవి..
అనుభూతిలో నిన్ను నింపినందుకు..

449. విరహం కొండెక్కుద్దిలే..
వినోదమై నా నిన్ను నేనల్లుకుంటే

450.చొరవెక్కువైంది చూపులకి..
అనుమతిలేకనే నీ అణువణువూ గాలిస్తోంది
.................................... ********.....................................

No comments:

Post a Comment