Wednesday, 18 November 2015

ద్విపదాలు : 1101 నుండి 1150 వరకు

..................................... ********.....................................
1101. ఆకలి..
సృష్టిలో చాలా ప్రాణులకు ఉద్భవించని ప్రశ్నావళి..
1102. తీరిందిగా తనివి..
నీలోంచీ విద్యుత్ నాలో ప్రవహించినప్పుడే..
1103. వికారాలు సంచరిస్తున్నాయిగా..
ఆత్మను బంధించి తాము విహారానికేగుతూ..
1104. నేను నువ్వయ్యానందుకే..
ఒక చైతన్యాన్ని ముక్కలు చేయరాదనే..
1105. అర్ధంకానివే కొన్ని..
చిన్నారి అలలకే తడబడే అడుగులు..
1106. సమాధానపడలేని జవాబులే అన్నీ..
అంతరంగాన్ని మధించి విడిచేసాక..
1107. వేదనను వేడుక చేసేసాలే..
నీవు పంపిన వెన్నెలకిరణాలతో..
1108. బంగారంలా మెరిసింది భావం..
మెరుగుపెట్టే నువ్వు దొరికావని..
1109. మౌనమే మిగిలింది..
మాటలకందని ఆవేదన గొంతును పూడ్చుతుంటే..
1110. మౌనమే మిగిలింది..
మల్లెలు నవ్విన సవ్వడికి విస్తుపోయిన నిన్ను చూసాక..
1111. మౌనమే మిగిలింది..
పాతివ్రత్యానికి పారితోషకంగా
1112. మౌనమే మిగిలింది..
తిమిర శూన్యంలోకి మనసు తొంగిచూసినందుకే..
1113. అదురుతున్న అధరాలనడుగు..
నీ మనసునెంత ప్రియమారా మోహించిందో..
1114. జీవితం వికసిస్తుంది..
అనుభవాల నయనాల్లో..చిగురించే ఆశల్లో..
1115. ఏకాంతానికే నా ఎదురుచూపులు..
నీ తలపులు మోసుకొస్తుందని..
1116. కాస్త చోటిమ్మని కమ్మగా అడిగావనుకున్నా...
గుండె జార్చి గల్లంతు చేస్తావనుకోలా..
1117. మరబొమ్మలుగా మారిపోయాముగా..
మనసు ముక్కలయ్యే అవకాశమే లేదులే..
1118. మరందాల వాననే కురిపిద్దామనుకున్నా...
గండుచీమవై కాటేస్తావనే భయపడ్డా..
1119. నిప్పులాంటి నిజాలు రాయొద్దన్నానా..
కాగితం దగ్ధమయ్యింది అందుకే..
1120. కలలను దోచుకెళ్దామనున్నా..
ఆల్చిప్పవంటి రెప్పలను కాపలా పెట్టావనుకోలా..
1121. నీలిమేఘమై ఝడిపిస్తావెందుకో..
నీలోని కృష్ణవర్ణం నాకు పూసేందుకా..
1122. నేడొకటుందని మరచిపోయా..
రేపటికై పరుగులుపెడుతూ..
1123. బుద్ధి బూరెలు తింటుంది..
తీపికి అలవాటు పడి..
1124. కన్నులు కలువలయ్యేనుగా..
నెలరాజువంటి నిన్ను రేయంతా అల్లుకొనేందుకు..
1125. చెంగల్వల్లో చేరాను..
రేరాజైన నిన్ను దగ్గరగా చూడాలనే..
1126. అడ్డాల్లో అమ్మతనం కావాలి..
గెడ్డాలొచ్చి గళం ఉద్రేకపడినా..
1127. కోయిలనై పలకరించాలనుంది..
ప్రకృతినే పల్లవిగా పాడి వినిపించి..
1128. నిరీక్షణలో నా కనులు..
నిశీధిలో నీరవానికీ బెదిరిపోతూ..
1129. షడ్రుచలనందించే నువ్వు దొరికావుగా...
నా జీవితమైతే నిత్య ఉగాదే..
1130. గాయమే మౌనం..
కాలం కరిగి కనికరం చూపేదాకా..
1131. వసంత నిత్యాగమనమే..
శిశిరాన్ని తరిమే నీ తోడున్నందుకు..
1132. జార్చేయాలనే చూస్తావెందుకలా..
నీలో భావమై నన్ను ఒదగనీయకుండా..
1133. నిరంతరోత్సాహం..
నటనలో జీవిస్తున్నందుకే కొందరికి..
1134. చీకటికే దాసోహమంతా..
రాతిరైనా రహస్యాల్లో వెచ్చగా ఒదగొచ్చని..
1135. ప్రేమను మరచిపోవద్దన్నానా..
ఆమె లేకుంటే నీ కవితకే మకుటం లేదుగా..
1136. కన్నీటితోనే మాత్రమే తీరే దాహం..
పన్నీటితో సైతం కడగలేని మోహం..
1137. రాజయోగమేగా...
నీలిమేఘం ఊహించని పూలవానలే కురిపిస్తే..
1138. కవితని తెలిసే ప్రేమించాను..
విషయ(మూ) తోడుందని తెలియక..
1139. మౌనం విరిగింది..
అంత పదునుగా నువ్వు చీల్చాక..
1140. ఆ ఆత్మీయత దొరికేది కాదులే..
నీ మనసు నుండే వెలివేసాక..
1141. అద్దంలో చూసుకు భయపడ్డాడేమో..
తన వికృతానికి విస్తుపోతూ ఉరకలెత్తిన మనిషి వాడు..
1142. అంగరాగాదుల పరిమళమనుకుంటా..
మనోరధాన్ని ఉరకలు పెట్టిస్తూ నీవైపు..
1143. ముగ్ధమే మౌనం..
మోహం తీరేదాకా..
1144. మౌనంగానే సాధించాలిక..
మాటల్ని పోట్లాటకి పయనం చేయించక..
1145. మూగబోయానందుకే..
మౌనమే పరిభాషని గ్రహించినందుకే..
1146. నేనుసైతం మెరవాలనే..
మాలికల నడుమ చెంగల్వల్లో చేరాను..
1147. మౌనమే పరవశములే..
వివశమైన మదిని వివరించలేని వేడుకలో..
1148. ఋతురాగం మరచిపోతున్నా..
నీ అనురాగానికి ఊ కొడుతూనే..
1149. అంతా ఆనందమే ఇక్కడ..
వియోగాన్ని కలంతో కాలరాసేస్తూ..
1150. కాటుకను కరిమబ్బులకు అరువివ్వొద్దన్నానా..
ఆ చొరవతో మెరుపొచ్చి చేరిందిగా తోడుగా కన్నుల్లో..
..................................... ********.....................................

No comments:

Post a Comment