Wednesday, 18 November 2015

ద్విపదాలు : 851 నుండి 900 వరకు

..................................... ********.....................................

851. నా హృదయంలో తడి మాయమయ్యింది..
నీ కిరణాల వెలుతులో ఆరబెట్టుకొని..

852. నవ్వితే తను...
వేలపున్నముల వెలుగుకిరణమే

853. వెలవెలబోవాలే చీకటైనా..
నీ వెలుతురు కిరణాల తాకిడికి..

854. హృదయం తూట్లు పడింది..
నీ కిరణానికి వెలుతురెక్కువనుకుంటా

855. చిన్మయమయ్యింది రూపం..
నీ చిరునవ్వుల వెన్నెల కిరణాలకే

856. కోల్పోతున్నా ఉనికిని..
నీ మౌనరహస్యంలో నన్ను దాచేస్తుంటే..

857. మాట మధురమయ్యింది..
నీ ఊసులతో పదాలు కూర్చాననే..

858. కంటిపై కునుకెక్కడిది..
వేసంగికి తోడు విరహమూ ఆజ్యమయ్యాక..

859. అలకెందుకో అక్షరాలకి..
భావముతో అలంకరించేందుకు మౌనాన్ని వేడుకుంటుంటే..

860. మిడిసిపడుతోంది మనోసంద్రం..
హృదయతీరాన్ని ముంచే కెరటాలు తనవేనని..

861. ఆమని రథమెక్కి వచ్చేసా..
నాకై ఎదురుచూసే కోయిలుందనే..

862. కన్నులు తెరిచి కలగంటున్నా...
పగటికలవై కన్నుల్లో కొలువుంటావనే..

863. కన్నులకి ఋతుపవనాలేమిటో..
చెక్కిలిని సేద తీర్చే నెపమేమో..

864. మెడలో ఉరితాడని భ్రమించిందేమో..
పదేపదే ఉక్కిరిబిక్కిరవుతూ ఆమె..

865. మౌనరాగాలెన్నో..
నీ మనసు తాళానికై ఎదురుచూస్తూ..

866. మది మౌనవించింది..
మనసులోంచీ నువ్వు వెలుతురై నిష్క్రమించాక..

867. కన్నులకు జలుబేమిటో..
తడియారని తలపులతో తనువెల్లా ముంచేస్తూ..

868. స్పృసించాలంటే భయమవుతోంది..
తాకేకొద్దీ మిధ్యాబింబాలు ఒక్కోటీ బయటపడుతుంటే..

869. గతమెప్పుడూ విలువైనదే..
చరిత్రగా మారిపోతూ..

870. అక్షరాలు మెరుస్తూనే ఉన్నాయి..
జీవితాన్ని అందంగా రాస్తున్నందుకు..

871. గిల్లుతూనే ఉంటావ్..
ఏడుస్తానో లేదో చూడాలన్న కోరికేమిటో..

872. గ్రీష్మమూ చిగురిస్తోంది..
నీ తలపుల సేద్యపు మహాత్యమనుకుంటా..

873. నీరవానికి పరిచయమెందుకులే..
నీవు లేనప్పుడు రవళిస్తూనే ఉంటోందిగా...

874. మంత్రమనుకుందేమో..
నీ మాటలకే వశమవుతూ మది..

875. ఎదుగుతూనే ఉన్నా..
నీ కవితలోని చైతన్యం నింపుకుంటూ..

876. కన్నీరు చిక్కనయ్యింది..
పలచబడుతున్న మానవత్వానికే..

877. పన్నీటి చిలకరింపే..
ఆనందం ఒక మోహనరాగమై నన్నల్లుకుంటే..

878. తడియారని కన్నులేమో అవి..
నిరంతర అనుభూతుల వెల్లువలో..

879. అంతర్మధనంలో సంఘర్షణ
జ్ఞాపకానికీ మరణం ఉంటుందని నమ్మలేక..

880. బంధం లేని అనుబంధం ఎక్కడుంది..
మకరందం లేని పువ్వు లేనట్లు..

881. నీ కిరణాల వెలుగుదివ్వెలే..
నాకు హృదయరశ్మిని పంచుతూ..

882. కూరుకుపోతున్న అడుగులు..
లోతెరుగని మానవత్వపు శిధిలాల అడుగుజాడల్లో

883. పరుగుపెడుతూనే ఉన్నా..
అంధకారం వీడి ఆనందాన్ని హత్తుకోవాలనే..

884. కుబుసానికున్న మెరుపలాంటిది..
నునుపుతో మాయచేసి మెత్తగా పెనవేస్తూ..

885. నిర్మాణానికి అనుమతెందుకో..
హృదయాన్ని అడక్కుండానే కబ్జా చేసాక..

886. జ్ఞాపకాల వెల్లువలో కొట్టుకుపోతున్నా..
ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకోవాలనే..

887. కాలం కసాయిది..
కనికరం లేక నిన్నల్లో నన్ను వీడి పరుగెడుతూ..

888. కంటిచెలమ ఎండిపోయింది..
హృదయంలోంచీ నీవు హఠాత్తుగా జారిపోయాక..

889. నా మనసు మూగదయ్యింది..
పిలిచినా బదులివ్వని నీ మనసు చూపిన అలుసుకే..

890. దూదిపింజయ్యింది నా తలపు..
అంబరాన్ని తాకి వచ్చిందందుకే..

891. విహంగమేగా నీ కల..
పెదవులనుండీ అలవోకగా ఎగురుతూ..

892. స్వప్నం సత్యమవ్వాలని కోరుకుంటున్నా..
నీ ఊసులింకా వినాలనే..

893. నీకెప్పుడూ స్వార్ధమే..
ఇద్దరమొకటైతే కలిసొస్తుందని...

894. నీ నీడై వెంటాడుతూనే ఉన్నా..
నీ వ్యసనం నేను కావాలనే..

895. గజఈతగాడివేగా నీవు..
గజమైనా వదలక మదిలో కలదిరుగుతూ..

896. ఆపేక్షనుకొని భ్రమపడ్డాను..
అతిగా ప్రేమిస్తుంటే..

897. రత్నాల రాశులే కనబడ్డాయి..
నే నవ్వుతూ వెతికాననేమో..

898. చెలిమిని వీడలేని వసంతమే..
గ్రీష్మంలోనూ నీ తోడై..

899. విరహం ఎక్కువయ్యిందేమో..
నన్ను దాటి హృదయంలో చేరింది..

900. బంధం అపురూపమయ్యింది..
నీ శ్వాసలో నన్ను చేరనిచ్చినందుకే..

..................................... ********.....................................

No comments:

Post a Comment