Thursday, 19 November 2015

ద్విపదాలు : 1851 నుండి 1900 వరకు

..................................... ********.....................................

1851. మల్లెలు చల్లానందుకే..
చల్లదనాన్ని పంచి కాశ్మీరాన్ని తలపిస్తాయనే..
1852. సముద్రం ఒంటరయ్యింది..
మౌకికాదులన్నీ ఆమె తనువును అలంకరిస్తుంటే..
1853. వెన్నెలెంత కందిపోయిందో..
నీ హృదయాన్ని తాకే సిగ్గులో..
1854. ఆమె నవ్వులో ఎప్పుడూ గెలుపే..
అప్పుడు పట్టుదలతో..ఇప్పుడు విజయంతో..
1855. తొలిముద్దు..
చెలికాని చూపులస్పర్శతోనే..
1856. ఆషాడమై కురుస్తున్నానందుకే..
వానకోయిల నీ కబురు తెచ్చిందిప్పుడేనని..
1857. ఆషాడం కురుస్తోందక్కడ..
వానకోయిల వలసొచ్చిందనే..
1858. రుధిరజలపాతాన్ని నేనేగా..
నీలో ఉరకలెత్తే ఆనందాన్ని వివరిస్తే..
1859. కొన్ని భావాలకర్ధముండదు..
అనుభవిస్తే తప్ప..
1860. ముంగురుల్లో నీ సరసం దాచేసా..
ఆ నలుగురూ ఊసులు వింటారనే..
1861. భారాన్ని తేలిక చేద్దామనొచ్చుంటాయి..
ఆలోచనకి అక్షరంగా మార్చేస్తావని..
1862. కలవరింతలన్నీ కలస్వనాలే..
నీ పిలుపుకే పెదవులు తొణుకుతూంటే..
1863. నీ మనసైన సావాసమే..
నను ముడివేసిన అనుబంధం..
1864. అరనవ్వుల మురిపాలే..
మనవైన సగపాలలో ఇద్దరిని ఒక్కటిచేస్తూ..
1865. నిద్దురేదో వలసపోయింది..
రెప్పల మాటున నీ దోబూచులాటకే..
1866. వెన్నెల్లో దీపానివే..
నా ఆశకు వెలుతురునందించే వేళలో..
1867.
పల్లవిగా మారిపోయానందుకే..
నీ పాటకు ముందుగా జతకావాలనే
1868.  చూపులు బదులిస్తాయెందుకో..
ప్రశ్నలేమో నా పెదవులు సంధిస్తుంటే..
1869. వసంతానికి తొందరెక్కువే..
మధువనమై విరబూస్తే వనమాలి విహారనికొస్త్తాడని..
1870. సంతోషం సుప్రభాతమయ్యింది..
నా మనసునేదో మౌనరాగం ఆవహించి..
1871. నీకు మాత్రం నేనెప్పుడూ లోకువే..
లోకులను తప్ప నన్ను విస్మరిస్తూ..
1872. మనసేదో గెలిచినట్లుంది..
నీ పెదవులపై నవ్వులు నర్తించగానే..
1873. నీ ఆనందాన్ని శాశ్వతం చేస్తాను..
రెప్పలమాటునే దాగుండి లోకానికి కనిపించక..
1874. జాలిగా పలకరిస్తున్నాయి..
బీడుగా మారిన నేలతల్లిని కుండపోతగా అభిషేకించలేని చినుకులు..
1875. అపశృతులను పాడేస్తున్నా..
నీకిష్టమని శివరంజనిలో శంకరాభరణాన్ని కలిపి..
1876. కలుగజేసుకుంటున్నా తీరికను..
భవిష్యత్తులో నిన్ను ఒంటరిగా విడువలేననే..
1877. ఎగిసాను..కానీ..
నీవో తాకలేని అంబరం కదా..
1878. నిశ్శబ్దం సైతం ఘోషిస్తోంది..
నీ మౌనాన్ని అనువదించిందనే..
1879. కన్నీటిబిందువులు రాలిపోతున్నాయి..
చెక్కిళ్ళపై సేద్యం తమవల్ల కాదంటూ..
1880. ఎన్నికళలు నేర్చిందో నీ గుండె..
అరవైఐదో కళగా మౌనాన్ని అనువదిస్తూ..
1881. వేలంపాటవుతోంది బ్రతుకుపాట..
పాడిందే పాడి గొంతు మూగబోతుంటే..
1882. మోహానికి లేదుగా మొహమాటం..
అవకాశానికి వేచిచూడాల్సిన అగత్యం..
1883. నిశ్శబ్దాన్ని వెంటేసుకు తిరుగుతావెందుకో..
మౌనమునిగా మనసులో శబ్దించేందుకా..
1884. చుక్కానిగా మారానందుకే..
నీ బ్రతుకుపడవకు గమ్యం నిర్దేశించాలనే..
1885. నందివర్ధనం నయనమంటినట్లుంది..
నీ అధరచుంబనపు సెగలు సోకుతుంటే..
1886. నిరీక్షణ సవ్వడించిందిగా..
నీ గమనానికి నా మువ్వలు జతపడి మేళవించినందుకు..
1887. పూసంత నవ్వుతావెందుకలా..
మనసంత మైమరపు మత్తులో కూరుకొనేలా..
1888. ఏమార్చా ఋతువులని..
ప్రతినిత్యం నీతో వసంతమై నేనుండాలనే..
1889. జాలిగా పలకరిస్తున్నాయి..
ఓదార్చడం తెలియని తారకలు ఏకాకినై మిగిలానని శోకిస్తూ..
1890. అక్షరం నవ్వింది..
నీ భావాలతో  పదును పెరిగిపోతుందని..
1891. చినుకుగా మారింది మనసు..
జల్లై నిన్ను ముంచెత్తాలనే..
1892. ఆషాడం విస్తుపోతోంది..
మబ్బులన్నీ నీ మనసులో దాచేసావని..
1893. వివశమవుతూనే ఉంటా నీ స్మృతులలో..
మనసు పుటలు గంధాలై పరిమళించినప్పుడల్లా..
1894. అక్షరాలుగా మారని భావాలెన్నో..
మనసులోనే నిశ్శబ్ద సమాధైపోతూ..
1895. ప్రేమంటే నన్ను గెలవడం కాదు..
ఏకాంతంలో నీలో నన్ను కనుగొనడం..
1896. నీ కంటిపాప కబుర్ల వల్లనేమో..
కలత నిద్రలు నా కోలకళ్ళకు..
1897. విలువ తరుగుతుంది ఆహార్యానికి..
అనుకరణలో జీవం కోల్పోతూ..
1898. దయలేని మేఘాలెన్నో..
సందేశాలు మోయడం తప్ప కర్తవ్యాన్ని మరచి తరలిపోతూ..
1899. సశేషంగానే కొన్ని జీవితాలు..
విశేషాలేవీ కానరాని చీకటిలో..
1900. యుగాల నిరీక్షణగా మారింది..
నీ ధ్యాసలో క్షణాలను లెక్కించడం మనసు మరిచాక..
..................................... ********.....................................

No comments:

Post a Comment