Wednesday, 18 November 2015

ద్విపదాలు : 1151 నుండి 1200 వరకు

..................................... ********.....................................

1151. ఎంత తొందరో భూదేవికి..
చినుకుని చేతిలో ఒడిసిపట్టాలని..
1152. చిరునవ్వులను జతచేసాగా..
 పన్నీటిచుక్కలను లెక్కించిక
1153. మాంత్రికుడే నాన్న..
కోరిన వరాలు తెల్లారేప్పటికే తీరుస్తూ..
1154. పాకుడురాళ్ళూ లెక్కలోకే రావులే..
నా మనసుమెట్లే అధిరోహించిన నీకు..
1155. ఆత్మవిశ్వాసమే కావాలి..
మనసులోని అంధకారాన్ని వెలుగువైపు నడిపేందుకు..
1156. నమ్మకాలవలలో ఆడది.
నీడను కూడా తోడుగానే భావిస్తూ..
1157. నిట్టూర్పైతేనేమి..
నీ శ్వాసలో చేరి పరిమళించిందిగా..
1158. ఆనందం అతిశయించినందుకే..
హృదయంలో మెరుపు కెంపై పెదవినలంకరించింది..
1159. మైమరచిపోయా..
విద్యుల్లతవంటి నన్ను మెరుపులా నువ్వు గుర్తించినందుకే..
1160. మెరుపుకలలనేమో..
నింగికెగిసి నిజం కానంటున్నాయి..
1161. మెరుపులీనింది మనసు..
స్మృతుల గాయాన్ని కన్నీటితో కడిగినందుకే..
1162. నన్న నడిపిస్తూ నీవు..
నిశీధిలో ఆత్మజ్యోతివైన మెరుపులా..
1163. కాటుక మెరుపు కరిగింది..
కన్నీరు ధారగా కురిసినందుకే..
1164. నా ఎదురుచూపులు మామూలే..
మెరుపల్లే అరుదెంచే నీకోసం..
1165. నీ పరిచయమై యుగమైనట్లుంది..
నాలో మెరుపులను లెక్కించుకుంటే..
1166. చంచలమైన మనసే నాది,,
నిలకడగా నిన్ను వరించేవరకూ
1167. పట్టుజారుతోంది మనసు..
పట్టుపుట్టమంత మెత్తనైన నీ సొగసుకే..
1168. అమరమౌతానంది ప్రేమ..
అరమరికలు లేక నన్ను ఆరాధించినందుకే..
1169. ఊపిరి కదిలింది..
నీ శ్వాసలో రాగమై ఒదిగేందుకే..
1170. అచ్చెరువైన చిత్తరువయ్యా..
బంధించిన నీ మనోనేత్రాల మురిపెముకే..
1171. విజయవంతమైన గెలుపే నాది..
వెతికి నిన్ను గెలుచుకున్నందుకు..
1172. వెన్నెల నవ్వుకుంది..
నీ నవ్వులో ప్రతిబింబాన్ని చూసుకొని..
1173. నీ వలపు ప్రేమగీతమే..
నన్ను పల్లవిగా మార్చేస్తూ..
1174. అంకురించిన భావాలెన్నో..
మొలకెత్తిన కవితాకొమ్మకి..
1175. గెలుపు మెరుపువంటిదేగా..
ఎంత ప్రేమించినా..హఠాత్తుగా మాయమవుతూ..
1176. మనిషిలో మృగాన్ని గుర్తించలేమెప్పటికీ
అడవిమృగమైతే బంధించే వీలు..
1177. బుగ్గల నునుపు చెప్పినప్పుడే అనుకున్నా..
ప్రబంధం రాసే పనిలో పడ్డావని..
1178. విశేషమే కొన్ని ప్రశ్నలు..
జవాబులకై ఎదురుచూపులు మిగులుస్తూ..
1179. కలలో బంధించావని మరచిపోయా..
కలవరిస్తున్నావనే కళ్ళ ముందుకొచ్చా..
1180. రెప్పలకు రాగాలు నేర్పిస్తున్నా..
పెదవులు మౌనాన్ని ఆశ్రయించినందుకే..
1181. మెరుపుదండ గుచ్చేసా..
నీ స్మృతులను మాలగా వేసుకుందామనే..
1182. అభిమానం తెలిసొచ్చింది..
అకాశమంత అందంగా నన్ను మార్చేసాక..
1183. ముసురేసిందేమో మనసుకి..
మెరుపుసవ్వడికే ఉలికిపడతావెందుకలా..
1184. మకుటంగా మార్చి మురిపిస్తావనుకున్నా..
కొసమెరుపంటూ తేలిగ్గా తీసేస్తావనుకోలా..
1185. విశ్వరహస్యానికి ప్రశ్నలుండవుగా..
నా పుట్టుకకు దుర్ముహూర్తం ఉండకూడదని..
1186. నిప్పులాంటి నిజాల జోలికి పోయేదెవరలా..
హుషారుగా అబద్దాలు అద్దంలా అలరిస్తుండగా..
1187. ప్రసాదాలే కొన్ని ఆకులు..
మట్టిలో కలిసి అంకురించేవరకూ..
1188. కడిగిన ముత్యమయ్యా నేను..
నీ కవితలో తానమాడినందుకే..
1189. ఘొల్లుమన్న మువ్వ..
నా పాదాలను వీడి నీ నిరాశల్లో చేరాయని..
1190. నీ కళ్ళలోకి చూసినప్పుడే తెలిసింది..
అప్పుడప్పుడూ నన్ను చూసి నవ్వుతున్నాయని..
1191. ఆమని గీతాలు వింటున్నావనుకోలా..
నువ్వలా నాలుక్కళ్ళతో చూస్తుంటే..
1192. అష్టవిధనాయికనని పొగిడావుగా..
నలుదిక్కుల్లో నృత్యం చేస్తున్నానందుకే నేను..
1193. అతిథిగానే ఏతెంచా నీ హృదయంలోకి..
నీ మర్యాద చూసి కొలువైపోయా..
1194. తిరిగి రాయలేని కవితే నీవు..
నా కలమో అద్భుతాన్ని రాసినందుకు..
1195. తలపులు పండిపోతున్నవి నాలో..
నిన్ను వెతికివెతికి అలసినందుకు..
1196. సరికొత్త రాగాన్ని కనుగొంటున్నా..
మనమో యుగళగీతంగా మారిపోదామనే
1197. కాలగర్భంలోకి జారిపోవాలనుంది..
నిన్నటి నిశ్చింత నేడు కరువయ్యిందని.
1198. మనసైన మణివే..
కిరణాలతోనే వెలుతురునిస్తూ..
1199. ఆషాడం అధికమయ్యింది..
మరోమారు గోరింటను అరచేత హత్తుకోమంటూ..
1200. నిత్యార్చన చేస్తున్నాగా నీకిష్టమైన రాగాలతో..
మౌనరాగమే ప్రియమంటూ నీరవంలో నీవున్నందుకు..

..................................... ********.....................................

No comments:

Post a Comment