Thursday, 19 November 2015

ద్విపదాలు : 2451 నుండి 2500 వరకు

..................................... ********.....................................
2451. నిరంతర ఘర్షణ..
అంతమవని వేదనలా..వ్యాధిగ్రస్థమైన శోకంలా..
2452. మయూరాన్ని చూసి నేర్చిందేమో మనసు..
నీలాన్ని చూడగానే మబ్బేసిందని భ్రమిస్తూ..
2453. అందని ఆకాశంలా వాస్తవం..
మనమధ్య దూరాన్ని వెక్కిరిస్తూ..
2454. నిలువరించేసా ఆత్రాన్ని..
నను వరించే నీవు చెంతనున్నావనే..
2455. వానవిల్లు విరుస్తోంది..
మయూరపు రెక్కలకు పోటీగా రంగులీనుతూ...
2456. మౌనరాగం ఓడిపోయింది..
ప్రేమగా నీవు పలకరించిన పిలుపుకి..
2457. ముఖపుస్తక మహాత్మ్యమేలే..
మోడైన మనసుకూ కొత్త చిగురులేసేస్తూ..
2458. మాట వినని మనసు..
వ్యర్ధాన్ని సైతం కళాఖండంగా మార్చే నేర్పు తనకుందంటూ..
2459. పొగడపూలు సిద్ధమయ్యాయి..
నీ వలపుజల్లుకు తామూ వస్తామంటూ..
2460. మౌనానికి లొంగని నువ్వు..
మాటకీ కొత్తర్ధాలు పుట్టిస్తూ..
2461. కుంకుమవన్నెలే చెక్కిళ్ళకు..
అలుకను ఆలింగనం చేసిన చొరవకు..
2462. విచ్చుకున్న చూపు నేడు..
కంట్లో కలత మాయమయ్యిందనే..
2463. ప్రేమలేఖలెన్ని రాసానో నేను..
నిన్ను గెలుచుకోవాలనే తాపత్రయంలో..
2464. ఆసరా కోల్పోతున్న అమ్మానాన్నలు..
చేయూతనిచ్చే చేతులు చేయిచ్చేస్తుంటే..
2465. సన్నజాజులు గమ్మత్తుగా నవ్వుకున్నాయి..
మాధవీలతవై నువు పెనవేస్తుంటే..
2466. రెక్కలొచ్చిన కొన్నిగువ్వలు ..
రేపటిని వెతుక్కొనే దిశగా పయనిస్తూ..
2467.బరువైన వాస్తవాలు కొన్ని..
పశ్చాత్తాపానికి ఆమడదూరంగా నేడు..
2468. నీ రెప్పలచప్పుడులో రాగం వింటున్నా..
నా మనసువీణ వాద్యసహకారం అందించిందనే..
2469. చిలిపినవ్వు చంచలమవుతోంది అప్పుడప్పుడూ..
ఈదురుగాలికి ఆకులు రెపరెపలాడినట్లు..
2470. హృదయం లయలు పోతోంది..
నా నవ్వుకు హారతులిచ్చావని..
2471. నీ మనసు మందారమనేగా..
చెలిమంటూ నే చేరదీసింది..
2472. కల్యాణిని ఆదరిస్తున్నా..
నువ్వు కన్నెత్తి చూడలేదని అలకవుతోందనే..
2473. శ్రీరాగాన్ని ఏనాడో పాడేసా..
శృంగారంపై నువ్వు మనసుపడ్డప్పుడే..
2474. కన్ను కవిత రాస్తోంది..
బాపూబొమ్మకు ధీటుగా నువ్వున్నందుకే..
2475. తోడిరాగాన్ని తోడడుగుతున్నా..
మెప్పించేందుకు నిన్ను ధైర్యాన్ని పంచుతుందనే..
2476. పంచదారబొమ్మనై నే కరిగిపోనా..
తీయగా నన్ను మలుస్తుంటే..
2477. మనసుముంగిట్లో నిలబడిపోయా..
గుమ్మానికి తోరణమంటూ వలపును వర్ణించావనే..
2478. కొన్ని దారులు దుర్గంధభరితమే..
మనసు ముక్కెంత మూసుకున్నా..
2479. వసంతహేల వినబడుతోంది..
మన మౌనపు రహస్యాన్ని అనువదించుకొంటుంటే..
2480. ఎంత గర్వమో నీ మనసుకి..
నీ చుట్టూరా తిప్పుకొని అల్లుకుపోతుంటే..
2481. మనసున విత్తే కలుపుమొక్కలు కొన్ని..
నీరు లేకుండానే వృక్షాలై ఎదిగిపోతూ..
2482. మౌనరాగాలనీ కాజేస్తావు..
నీ మాటలకు మంత్రముగ్ధనై నేనుంటే..
2483. మూగవీణనే నిన్నటివరకూ..
నీవొచ్చి శృతిచేసి రాగాలు దోచేంతవరకూ..
2484. చుక్కలు కోసుకొస్తానంటావెందుకో..
చుక్కనై నేనే నీ పక్కనుండగా..
2485. రెండునాల్కల మనిషనుకుంట..
పరస్పర విరుద్ధభావాలను తానే ప్రకటిస్తూ..
2486. చెలి సిగ్గులకర్ధం అడుగుతావే..
నీ చూపుకు అదుపులేనప్పుడు..
2487. యుగళగీతాన్ని మరచిపోయా..
నీ విషాదంలో నేను కూరుకుపోయి..
2488. ఎప్పటికప్పుడు బ్రద్దలవ్వాలనే అనుకుంటా..
విస్పోటించి గాయంచేయలేక మానుకున్నా..
2489. భాద్రపదానికి బానే న్యాయం చేస్తున్నావుగా..
కన్నుల్లో నన్ను వర్షంగా కురిపించి..
2490. నీ ఊహలవేడితో రగులుతున్నందుకేమో..
నా నిట్టూర్పుల గాడ్పులకే మసకవుతున్న ఇంట్లోని అద్దం..
2491. సగం బలం సంతోషమే ఇస్తోంది..
నీ వియోగంలోని నా నీరసానికి..
2492. తాత్కాలికంగా మానిందేమో మనసు గాయం..
అంతర్నిహితంగా అంతమయే సమస్యే లేనందుకు..
2493. మహామౌనంలో కూరుకుపోతున్నా..
నీ తలపుల తాదాత్మ్యాన్ని అనుభవిస్తూ..
2494. గుండె చెరువైపోతోంది..
అనుభూతిరాహిత్యానికి ప్రతినిధినిగా నేను మిగిలానని..
2495. గొంతులోని గారం గమకమయ్యింది..
నీవంతా ప్రేమగా పిలిచినందుకే..
2496. నీవిక్కడే ఉన్నావనిపిస్తోంది..
నీ తనూగంధం మనసును తాకిందని..
2497. ప్రేమపూజారిగా మిగిలా నేను..
దేవతవని నిన్ను కొలిచినందుకు..
2498. మనసైన మణివయ్యావు..
స్వాతిముత్యమంటి నిన్ను ఆణిముత్యంగా మార్చుకున్నాక..
2499. నిరీక్షించడం మానేసాననుకే..
నిత్యం నాతోనే తిరుగాడుతావని తెలుసుకున్నందుకే..
2500. చిరునవ్వుతో చెలిమిచేస్తున్నా..
కన్నీటితో మనసుకు జలుబు చేస్తోందనే..
..................................... ********.....................................

No comments:

Post a Comment