Wednesday, 18 November 2015

ద్విపదాలు : 0951 నుండి 1000 వరకు

..................................... ********.....................................
951. అమాసైన జీవితాలెన్నో..
పున్నమనుకొని ప్రమిద వెలుతురుని నమ్మినందుకు..
952. నన్ను మెచ్చినందుకేమో..
నా అభినయం నచ్చినందుకు ఆనందిస్తున్నా...
953. వెలుతురు చినుకులెన్ని రాల్చానో..
చెలిమి వెన్నెల్లు పూయించాలని..
954. ఊపిరాగిపోతోంది..
నీ ఊసులను మనసు వినలేదంటే..
955. ఎద సరిగమ..
జ్ఞాపకాలు గవ్వలై గలగలమను వేళ..
956.  విజయపర్వం ఆనాడే రాసానుగా..
నా గెలుపు తథ్యమనిపించినప్పుడే..
957. అక్కున చేర్చుకోవడమెందుకు ఆవేదనని..
జీవితంపై మక్కువ పెంచుకోవచ్చుగా..
958. నా నవ్వుకి వంకలు పెట్టావనేమో..
పెదవి నెలవంకై అలుకను సింగారించింది..
959. అక్షరాల గారడీనే..
నిదురించిన మనసునూ అలవోకగా తట్టిలేపుతూ...
960. కరిగిపోతోంది హృదయం..
నీ కన్నీటి వెచ్చదనానికి ద్రవించినందుకే..
961. రెప్పల కోలాటమే..
సరికొత్త ఆటను కన్నులకు పరిచయిస్తూ..
962. అక్షరాల విరహాలేమిటో..
మన ప్రేమను ఆవిష్కరించాలనే తొందరలో..
963. నీ చెలిమి కిరణం చాలుగా..
నాలో తిమిరాన్ని తరమగొట్టి వెన్నెలయ్యేందుకు..
964. ఒంటరితనమే మిగిలింది..
జ్ఞాపకాలు సైతం నన్ను వీడిపోయాక..
965. మోడ్పులే కన్నులు..
నీ తలపులు తడిమినంతనే అరమోడ్పులైపోతూ..!
966. నిశ్శబ్దం..
సుందరలిపిని ఆలకిస్తున్న ఓ మౌనం..
967. మౌనవించిన ప్రేమనే..
గుండెల్లో గుట్టుగా నన్ను దాచావనే
968. వెచ్చనైన కన్నీరు..
భారమై ఒలుకుతూ..
969. నీ మధురోహలు అమృతాలే..
నాకు దోసిళ్ళతో అందించేవేళ..
970.శోధిస్తున్నా...
నీ మౌనరహస్యంలోని ఆంతర్యాన్ని..
971. ఎర్రమందారం ఊగినట్లుంది..
నా మనసు అలవోకగా కదిలిందేమో నీ మాటలకి..
972. బ్రతుకే విరాగమవుతోంది..
గతితప్పిన అనురాగానికో..శృతితప్పిన సరాగానికో..
973. స్వార్ధం దూరమవుతోందనుకుంటా..
నీ మధురస్మృతులు చాలనిపిస్తూ జీవితానికి
974. కాటుకపిట్టలను కాపలా పెట్టావుగా కన్నులకి..
చీకటి చీల్చుకొనెలా వచ్చేది కలలోకి..
975. మౌనవించా...
నా ప్రేమకు అర్ధాన్నిచ్చావనే..
976. స్వప్నం కనుమరుగయ్యింది..
లక్ష్యం నిద్దురలేపినందుకే..
977.  ఆకలికి నోరుంటేనేమి..
స్వేదం నిశ్శబ్దంగా కరిగి నీరవుతుంటే..
978. బ్రతుకు నిత్యపాఠమైతేనేముంది..
నేర్చుకొనే విద్యార్థులే కరువైన నేటికి..
979. ఒక గళం మూగబోయింది..
జనాక్రోశాన్ని నిన్నల్లో విడిచేస్తూ..
980. ముంగురుల నాట్యాలు..
నెమలిపింఛాల చిరుగాలేమైనా అలవోకగా సోకిందేమో..
981. విరహమవుతున్న ప్రేమ..
విషాదంలో నేను..వైరాగ్యంలో నువ్వు..
982. వర్తమానం విషాదమే..
గతంలో ఉన్న నువ్వు దూరమయ్యాక..
983. మాలికల సారధి..
అక్షరాలకీ భావాలకీ మధ్య నువ్వు..
984. నీ చిగురింతలు బంగారం కాను..
నవ్వినవ్వి బుగ్గలు నొప్పి పుడుతున్నాయి
985. నీ అందెలు రవళిస్తున్నాయి ఎదలో..
మన ప్రేమను నర్తనం చేసినందుకే..
986. నక్షత్రకుడివని పొరబడ్డాను..
నేడు నీ మనోభీష్టానికి తలవంచుతూ..
987. నీవో సముద్రం..నేనో గగనం..
కలిసినట్లే కనిపిద్దాం నీలాన్ని మోహించేవారికి..
988. అన్నులమిన్న కన్నులవ్వి..
వెన్నెలతోనే వెలుగుని ప్రసరించే దివ్వెలవి..
989. మనసు మత్తిల్లింది..
నీ గోరంతగుండెలోని ఊసులకు తలూచుతూ..
990.  నిలదీసి అడగాలనుంది..
ఆడవారి ఆత్మగౌరవమంటే చులకనభావం దేనికని.
991. నిలదీసి అడగాలనుంది..
అహంకారపు అజమాయిషీని..దోపిడీ వారసత్వాన్ని
992. నిలదీసి అడగాలనుంది..
ఉన్న గుప్పెడుమనసూ నాకిచ్చేస్తే నువ్వేమవుతావోనని
993. నిలదీసి అడగాలనుంది..
నీ చిరునవ్వుల రహస్యం నేనుకాక మరెవ్వరు కాగలరని..!
994. కాటుక కరిగించిన కన్నీరు పన్నీరయ్యింది..
నీపై ప్రేమను కురిపించే వెల్లువలో
995. భూమి వేదికయ్యింది..
నా పాదాల అడుగులకు రంజిల్లుతూ..
996. కావ్యనాయిక కన్నులేమో అవి..
కవితకు అరమోడ్పులతో స్పందిస్తూ..
997. నరకంలో కాలు మోపావందుకేనేమో..
వైతరిణిలో ఈదులాడాలని ఉందన్నావుగా..
998. నీ చూపుల కిరణాలున్నాయిగా..
నిశీధిలో వెన్నెల కురిపించేందుకు..
999. తొలివలపు రోదనేమిటో..
అపశకునమవుతూ నా మనసు ముంగిట్లో..
1000. ఆశల పరుగుపందెమంతేగా..
మనసు ఓడి ముద్దాయిగా నిలిచింది..

..................................... ********.....................................

No comments:

Post a Comment